హైదరాబాద్, ఫిబ్రవరి19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తరగని చారిత్రక గని అని, ఈ ప్రాంతం నుంచి అనేక చారిత్రక పరిశోధక నవలలు రావాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పరిశోధక రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రాసిన కొండమల్లు నవలను గురువారం ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తితో కలిసి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్‌కు అందించారు. 800 ఏండ్లనాటి పల్నాటి సీమ చరిత్ర, చెంచు సామాజిక అంశాలను కొత్త దృష్టితో, మరింత పరిశోధనతో రాసిన నవల మూలకథను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల నుంచి మొదలై ఆంధ్రా, రాయలసీమ వరకు విస్తరించిన నల్లమల చెంచుల జీవనం, సంస్కృతి, ప్రస్తుతం వారి అవసరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణకు వర్ధమాన సాహిత్యకారుల అవసరం ఉన్నదని, తెలంగాణ చారిత్రక అంశాలను, సాహిత్యాన్ని పరిశోధించి రాయాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లును అభినందించారు.
రాజధానిని విస్తరించాలనే ఆకాంక్షతో చెంచు పెంటలపై బ్రహ్మనాయుడు సైన్యాలు దండెత్తడం, దెబ్బతిన్న చెంచుల నాయకుడు బయ్యన్న కారుకోడిని పట్టుకొని, దాన్ని కొండమల్లుగా తీర్చిదిద్ది ప్రతీకారం తీర్చుకోవడమనే చారిత్రక, సామాజిక ఇతివృత్తంతో ఉతంఠగా, ఆసక్తిగా సాగే కొండమల్లు నవలను ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అల్లం నారాయణ, ప్రముఖ నవలాకారులు బండి నారాయణస్వామి, అట్టాడ అప్పలనాయుడు తదితరులు ఆవిషరించారు.