కాంగ్రెసోళ్లు వస్తే ఏదో చేస్తరని ప్రజలు ఆశపడ్డరు. ఇప్పుడు గోసపడుతున్నరు. అప్పుడు ఇట్లనే అయితదని చెప్పినం. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ అంటరని.. మిమ్మల్ని ముంచుతరని నాడే చెప్పిన. తులం బంగారం ఇస్తామంటే వీళ్ల సంగతేందో చూద్దామని ఓట్లేసిండ్రు. ఇప్పుడు మొదటికే మోసమైందని బాధపడుతున్నరు. కైలాసం ఆటల పెద్దపాము మింగినట్టున్నది ప్రజల పరిస్థితి.. ఎటుపడితే అటు నమ్మి ఓట్లేస్తే ఏమైందో ప్రజలకు తెలిసిపోయింది.
ఒక్క రైతుబంధే కాదు.. అన్నీపోయి గంగల కలిసినయ్. కరెంట్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. మార్చి, ఏప్రిల్‌లో ఏం జరుగుతదో తెలియకుండా ఉన్నది. కనీసం మంచినీళ్లు కూడా సరిగ్గా ఇస్తలేరు. ఇదేందని అడిగే నాథుడు లేడు. ఎవరన్న గట్టిగ నిలదీస్తే పోలీసులకు పట్టిస్తున్నరు. ఇదేనా రాజ్యం ? ఇట్లనే ఉంటదా రాజ్యం?
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
మీకు ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఎందుకు? పది మందికి మేలు చేయడానికా? లేక తమాషా చేయడానికా? ఓపిక పట్టేకాడికి పట్టినం. ఇప్పటికి 14 నెలలైంది. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదు. ప్రభుత్వం మెడలు వంచేందుకు ప్రత్యక్ష పోరాటాల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలె.
-బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
KCR | హైదరాబాద్/ సిద్దిపేట ప్రతినిధి/గజ్వేల్, జనవరి 31(నమస్తే తెలంగాణ): ‘ఈ రోజు నేను గంభీరంగా ఉన్నా. మౌనంగా చూస్తున్నా..త్వరలోనే వస్తా’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలను లేవదీయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒకరికీ మేలు జరిగే దాకా బీఆర్ఎస్ పార్టీ రక్షణ కవచంలా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ‘ఫిబ్రవరి నెలాఖరులో ఒక బహిరంగ సభ పెట్టుకుందాం. తెలంగాణ శక్తి ఏందో మళ్లోసారి చూపి వీళ్ల మెడలు వంచి భవిష్యత్తు కోసం రాజీలేని పోరాటం చేస్తాం’ అని చెప్పారు. శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో పాదయాత్రగా వచ్చిన కార్యకర్తలను కలిసిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 14 నెలలు ఓపిక పట్టామని, వాళ్లు చేస్తున్న దుర్మార్గపు పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేసీఆర్ తెలిపారు. ఎంతో కష్టపడి ఎన్నో ఏండ్లపాటు ఉద్యమాలు చేసి పోరాడితే తెలంగాణ వచ్చిందని, వచ్చిన తెలంగాణను పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గాడిలో పెట్టిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలల్లోనే తెలంగాణను నాశనం చేసి ప్రజలను అరిగోస పెడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చిన ఆరేడు నెలల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు 24 గంటల కరెంటు సరఫరా చేసిందని, పెద్దపెద్ద సిపాయిల్లాగా భావించే కాంగ్రెస్ వాళ్లు గతంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు.
ఏదో చేస్తరనుకొని గోసపడుతున్నరు
‘కాంగ్రెసోళ్లు ఏదో చేస్తరని ప్రజలు ఆశపడ్డరు. ఇప్పుడు గోసపడుతున్నరు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘అప్పుడు ఇట్లనే అయితదని చెప్పినం. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ అంటరని, మిమ్మల్ని ముంచుతరని అప్పుడే చెప్పిన. తులం బంగారం ఇస్తానంటే వీళ్ల సంగతేందో చూద్దామని ప్రజలు ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు మొదటికే మోసమైందని బాధపడుతున్నరు’ అని ఉదహరించారు. పదేండ్లలో రైతులు బాగుపడ్డరని, రైతుబంధు పైసలు పడితే ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు అన్నీపోయి గంగలో కలిశాయని మండిపడ్డారు. ‘ఇప్పుడు వాళ్లు ఎంత ఇస్తారో భగవంతుడికే తెలుసు. అది ఇచ్చినా మోసమే.. ఎన్నికల కోసమే’ అని విమర్శించా రు. కరోనా సమయంలో రాష్ర్టానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం ఆగొద్దని, రైతులను నిలబెట్టాలని నాలుగైదు పథకాలను తీసుకొచ్చి కాపడుకుంటే రైతులు గౌరవంగా బతికారని గుర్తుచేశారు.
రైతుబీమాతో గుంటభూమి ఉన్నవారికి చిన్న రైతులకు సాయం అందిందని, గొర్రెల కాపర్లకు గొర్లు, మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు ఇట్లా అన్ని వర్గాల వారిని ఆదుకున్నామని వివరించారు. అందరూ పైకి రావాలనే ఉద్దేశంతో పథకాలు తెచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ ముస్లిం ఓట్లు వేయించుకొని వాళ్లకు ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే వారి ని గుర్తించి ఇమాంలకు, మౌజంలకు గౌరవ వేతనం ఇచ్చామన్నారు. ‘మైనార్టీ, గిరిజన, ఎస్సీ, బీసీ పిల్లల కోసం ఎంతో మంచి గురుకులాలను ఏర్పాటు చేస్తే అద్బుతంగా చదువుకున్నారు. ఇప్పుడు గురుకులాల్లో పురుగులన్నం, విషాహారంతో భోజనం పెట్టడంతో కడుపునొప్పితో బాధపడుతున్న పిల్లలను తల్లిదండ్రులు తీసుకపోతున్నరు’ అని వాపోయారు.
సంగమేశ్వర-బసవేశ్వర కోసం దండయాత్ర
‘గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నం. మంచి నీళ్లు తెచ్చుకున్నం. జహీరాబాద్ నియోజకవర్గంలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ఆపి రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నది?’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రక్రియలూ పూర్తిచేసి కాంట్రాక్టర్లు పనులు చేస్తుండగా కాంగ్రెస్ వచ్చి ఆ టెండర్లను ఎందుకు ఆపిందని ప్రశ్నించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ఎందుకు నిలిపివేసిందని, ఎవరి కోసం నిలిపివేసిందని నిలదీశారు. రెండు నియోజకవర్గాల ప్రజలను సమీకరించి హరీశ్‌రావు పెద్ద ఎత్తున సంగమేశ్వర-బసవేశ్వరపై దండయాత్ర చేయాలని పిలుపునిచ్చారు. ‘మనం ప్రత్యక్ష ప్రజాపోరాటాలు లేవదీసి కచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర-బసవేశ్వరను సాధించాలె.
అటువంటి పోరాటానికి నేను కూడా మీతోనే ఉంటా’ అని తేల్చిచెప్పారు. కోట్లాడితేగాని రాదని, కొట్లాట తప్పదని, కోట్లాడితేనే తెలంగాణ వచ్చిందని, దీనికి కూడా ప్రజలు విజృంభించాలని పిలుపునిచ్చారు. సంగమేశ్వర-బసవేశ్వరకు నీళ్లు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. లక్షాయాభైవేల ఎకరాలకు నీళ్లు వస్తాయని, పంటలు పండితేనే మనం బతుకుతామని చెప్పారు. అందోల్‌లో కూడా 70-80 వేల ఎకరాలున్నాయని అక్కడి మంత్రి ఏం చేస్తున్నాడని నిలదీశారు. ‘మీకు ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఎందుకు? పది మందికి మేలు చేయడానికా? లేక తమాషా చేయడానికా?’ అని నిలదీశారు. ‘వీళ్ల మెడలు వంచి అన్నీ సాధించుకొవాలంటే మీరు పోరాటానికి సిద్ధం కావాలి’ అని పిలుపునిచ్చారు. ‘ప్రాజెక్టుల ద్వారా సాగు నీళ్లు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీళ్లను ఇచ్చుకున్నం. నీటి తీరువా రద్దు చేసినం. చెరువులు బాగు చేసినం, మల్లన్నసాగర్ వంటి ఎన్నో రిజర్వాయర్లు నిర్మించుకున్నం. రైతు బీమా వంటి పథకం పెట్టి గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా అతడి కుటుంబాన్ని ఆదుకున్నం’ అని కేసీఆర్ వివరించారు.
14 నెలలు ఓపిక పట్టినం..
‘ఓపిక పట్టేకాడికి పట్టినం.. ఇప్పటికి 14 నెలలైంది. ప్రజల కోసం ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా ఉండాలె’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం.. తెలంగాణను సాధించి, వచ్చిన తెలంగాణను లైన్లో పెడితే ఈ దరిద్రులు వచ్చి నాశనం పట్టిస్తున్నరు. తెలంగాణను కాపాడుకోవాలంటే మళ్లీ మీరు కథానాయకులు కావాలె’ అని ఉద్భోదించారు. ‘ప్రాణం పోయినా సరే.. తెలంగాణకు రక్షకులం మనమే. తెగించి కోట్లాడాల్సిందే. కోట్లాడి తీరాల్సిందే’ అని తేల్చిచెప్పారు. ఒకవేళ రాష్ట్రవ్యాప్తంగా కదలాల్సి వస్తే తాను పిలుపునిస్తానని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యక్ష ప్రజా పోరాటాలను లేవదీసైనా మన ప్రాజెక్టులు, నీళ్లు సాధించుకోవాలని ప్రజలకు న్యాయం చేసే దాకా కోట్లాడాలని పిలుపునిచ్చారు.
ఫిబ్రవరి నెలాఖరులో బహిరంగసభ
‘తెలంగాణను సాధించిందే గులాబీ జెండా.. ప్రభుత్వంలో ఉండి దేశంలో ఎవరూ చేయలేని అభివృద్ధి కార్యక్రమాలను చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక ప్రజాసమస్యల విషయంలో నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించేది లేదు’ కేసీఆర్ హెచ్చరించారు. మోసం జరిగిందని.. ఆ మోసానికి ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ‘ఎక్కడి దాకా చేస్తారో చూద్దామని నాలుగు రోజులు చూసినం. కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నరని మనోళ్లందరూ చెప్తున్నరు. సంగమేశ్వర, బసవేశ్వర, పాలమూరు ఎత్తిపోతల పథకాలను అక్కన్నే పెట్టిండ్రు.. కాళేశ్వరంను అట్లనే ఎండబెడుతున్నరు.. ఏదన్న చేయాలని కోరుతున్నరు’ అని చెప్పారు. ఫిబ్రవరి నెలారులోగా బహిరంగ సభ పెట్టి తెలంగాణ శక్తిని మరోసారి చూపిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనను సమీక్షిస్తామని, భవిష్యత్తు కోసం కోట్లాటకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కోటి రూపాయల భూమిని యాభై లక్షలకు కూడా అడిగేవారు లేరని, ఇది ఒక్కరి బాధ కాదని, అంతటా ఇదే పరిస్థితి ఉన్నదని వాపోయారు. ప్రతి ఒక్కరూ భూముల ధరలు పోయినందుకు బాధపడుతున్నారని, మారుమూల గ్రామంలో కూడా ఎకరానికి నలభై, యాభై లక్షలు ఉండెనని, ఇప్పుడు సగాని సగం పడిపోయి నాశనం చేశారని మండిపడ్డారు. ఇలాగే వదిలిపెడిడే నాశనం మవుతుందని, దొరికితే కొడుదామన్నంత కోపంతో ప్రజలు ఉన్నారని చెప్పారు.
కాగ్ నివేదికే నిదర్శనం
కాంగ్రెస్ తెలివితక్కువ తనానికి కాగ్నివేదికే నిదర్శనమని కేసీఆర్ పేర్కొన్నారు. కాగ్ నివేదిక ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుడు ఆదాయం కంటే 13 వేల కోట్ల ఆదా యం తగ్గిందని, అది మార్చి నాటికి 15 వేల కోట్లకు చేరుతుందని చెప్పిన విషయాన్ని ఉదహరించారు. ‘నాలుగైదు నెలలైతే జీతాలు పెం డింగ్ పెడుతరు. ఇంకా కొంత కాలం గడిస్తే రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఒడిదొడుకులను ఎదురొంటుందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నరు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా సరిగ్గా ఇస్తలేరు’ అని కేసీఆర్ పేరొన్నారు. ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారని, వీళ్ల మెడలు వంచాల్సిందేనని, ప్రజా పోరాటాల్లో తాను కూడా పాల్గొంటానని కేసీఆర్ తేల్చిచెప్పారు.
కేసీఆర్‌పై ప్రజల అచంచల అభిమానం : హరీశ్
140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎర్రవల్లికి వచ్చారంటే కేసీఆర్‌పై ఎంత అభిమానం ఉన్నదో ఇది నిరూపిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో హరీశ్ మాట్లాడుతూ గతంలో కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్‌ను కలిసేందుకు తనను, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావును ప్రత్యేకంగా సమయం ఇప్పించాలని జహీరాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు అడిగినట్టు గుర్తుచేశారు. ప్రతేక్యంగా ఈ రోజు మీకే సార్ సమయం ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్యంగా పరమేశ్వర్ పాటిల్ వారితో పాటు 140 కిలోమీటర్లు ఐదురోజుల పాటు పాదయాత్రగా వచ్చారంటే బీఆర్ఎస్ ఎంత బలంగా ఉన్నదో, ఎంతబలంగా వారు పనిచేస్తున్నరో చెప్పేందుకు ఉదాహరణ అన్నారు. కేసీఆర్‌పై ప్రజ లు, శ్రేణులకు ఉన్న అచంచల విశ్వాసాన్ని ఇది రుజువు చేస్తున్నదని కొనియాడారు.
140 కిలోమీటర్ల పాదయాత్రతో కేసీఆర్ వద్దకు
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు జహీరాబాద్ నుంచి 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వచ్చిన పార్టీ నాయకులు, అభిమానులు ఎర్రవెల్లికి చేరుకున్నారు. ‘తెలంగాణ జాతిరత్నాలు మీరు. బీఆర్ఎస్కు పట్టుగొమ్మలు మీరు. మీ కష్టం వృథాపోదు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశం సందర్భంగా పాదయాత్ర నిర్వహించిన మాజీ సర్పంచులు పరమేశ్వర్ పాటిల్, బోయిని చంద్రయ్య, పార్టీ నాయకులు సంగమేశ్వర్, ప్రశాంత్, బోయిని శ్రీనివాస్, ప్రదీప్ తదితరులు పార్టీ అధినేతను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు , సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చేది మన ప్రభుత్వమే
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సొంతంగా చేసుకున్న సర్వేనే ఇందుకు నిదర్శమని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు చేయించుకున్న సర్వేలో 75శాతం మంది బీఆర్ఎస్ పాలనే బాగుందని పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు. వందకు వంద శాతం ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చారని, తప్పకుండా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. ‘బీఆర్ఎస్ విజయం కేవలం పార్టీ విజయం కాదు. తెలంగాణ రైతుల విజయం. పేదల విజయం’ అని కేసీఆర్ స్పష్టంచేశారు.
కరెంట్ కథ మొదటికి
కాంగ్రెస్‌తోనే కరెంట్ కోతలు మొదలయ్యాయని, కరెంట్ కథ మళ్లీ మొదటికే వచ్చిందని కేసీఆర్ ఆవేదన చెందారు. మార్చి, ఏప్రిల్‌లో ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్నదని, కనీసం మంచినీళ్లు కూడా సరిగ్గా ఇస్తలేరని వాపోయారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే పోలీసులకు పట్టిస్తున్నారని, రాజ్యం అంటే ఇట్లనే ఉంటదా? అని నిప్పులు చెరిగారు.
అందరి మంచికోసం పాటుపడేది బీఆర్ఎస్సే.. మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డా మన బిడ్డే. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులం మనమే. తెగించి కోట్లాడాల్సిందే. కోట్లాడి తీరాల్సిందే.. అవసరమైతే ప్రత్యక్ష ప్రజా పోరాటాలను లేవదీసైనా సరే.. మన ప్రాజెక్టులు, నీళ్లు సాధించుకోవాలె. ప్రజలకు న్యాయం జరిగేదాకా కోట్లాడాలె. -కేసీఆర్