KCR | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు రక్షణ కవచంలా ఉండే సైన్యాన్ని తయారుచేసుకోవాలని, రాష్ట్ర అస్తితాన్ని నిలబెట్టే ఫైటర్స్‌గా తీర్చిదిద్దాలని పార్టీ నాయకులకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణకు కించిత్ అవమానం జరిగినా తట్టుకోలేని తెలంగాణ ఆత్మగల్ల కమిటెడ్ క్యాడర్ కావాలని, అధికారంలో ఉన్నా లేకున్నా అద్భుతంగా పనిచేసే సైనికులను తయారుచేసుకోవాలని సూచించారు.
‘మనమే వారిని సెలెక్ట్ చేసుకొని సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దుకోవాలి. జిల్లాకో పార్టీ కార్యాలయం ఉన్నది కాబట్టి క్యాడర్‌ను తయారుచేసుకొని వారికి నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. బీఆర్ఎస్ అంటే గుండెలో పెట్టుకొనే వాళ్లు ఎంతో మంది ఉన్నరు. వారిని సుశిక్షితులుగా తయారుచేయాలి’ అని ఆదేశించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ముఖ్యనేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన కేసీఆర్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. అనంతరం నాయకుల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. రెండున్నరేండ్లుగా రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు అవమానం జరిగినా నోరెత్తని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల వ్యవహారాన్ని తూర్పారబట్టారు. ఇకమీదట గతంలో మాదిరిగా పరిస్థితి ఉండదని, క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్లకే పార్టీ టికెట్లు ఇస్తామని తేల్చిచెప్పారు.
ఈ ప్రభుత్వం భూకబ్జాల్లో నంబర్ వన్
కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలూ అద్భుతంగా పురోగమించి దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిన స్థితి నుంచి ఇవ్వాళ దీనస్థితికి వెళ్తూ తిరోగమనంలో పయనిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన హయాంలో అన్నిట్లో నంబర్ వన్ ఉంటే ఈ ప్రభుత్వం భూ కబ్జాల్లో నంబర్ వన్, కూలగొట్టుట్లో నంబర్ వన్. పేదల నోట్లో మట్టిగొట్టుట్లో నంబర్ వన్, రైతుబంధు ఎగబెట్టుట్లో నంబర్ వన్‌గా ఉన్నది’ అని తూర్పారబట్టారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, రైతుబంధు ఇవ్వడం, సంక్షేమాన్ని అద్భుతంగా తీసుకెళ్లడం.. ఇలా అన్ని రంగాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణను నేడు ఇంతటి దయనీయస్థితి దిగజార్చిన కాంగ్రెస్ పాలనను ప్రజల కండ్ల ముందు ఉంచాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఇంత మూర్ఖమైన ప్రభుత్వం ఉంటదా?
రాష్ట్రంలో మూర్ఖమైన పాలన కొనసాగుతున్నదని కేసీఆర్ మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందుచూపుతో రాజ్యాంగంలో పొందుపరచిన అంశాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా 125 అడుగుల విగ్రహం పెట్టుకొని, తెలంగాణ ఖ్యాతిని సమున్నతంగా నిలబెట్టుకోవాలనే సంకల్పంతో సచివాలయం కట్టుకొని ఆ మహనీయుడి పేరు పేరుపెట్టుకున్నామని, అనేక రాష్ర్టాల నుంచి ఒక్క అంబేద్కర్‌వాదులే కాకుండా ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు వచ్చి అంబేద్కర్ భారీ విగ్రహాన్ని చూసిపోతున్నారని వివరించారు. రెండున్నరేండ్లుగా ఆ మహనీయుడి విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు కూడా వీల్లేకుండా చేశారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇంత మూర్ఖమైన..చండాలమైన ప్రభుత్వం ఉంటదా? అంబేద్కర్‌కు నివాళులర్పించని మూర్ఖపు ఆలోచనలు, చిల్లర వేషాలతో పాలన సాగించే ప్రభుత్వం మరొకటి ఉంటదా?’ అని నిప్పులుచెరిగారు.
‘కాంగ్రెస్ పోవాలె.. బీఆర్ఎస్ రావాలె’ అని అన్ని వర్గాల ప్రజలు ఏకోన్ముఖులై నినదిస్తున్నారని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు, వారి కష్టసుఖాల్లో నిత్యం భాగస్వామ్యం కావాలని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. ‘బీఆర్ఎస్ అల్లాటప్ప పార్టీ కాదు.. తెలంగాణ ఆత్మగల్ల పార్టీ’ అని తెలంగాణ సమాజం సగర్వంగా తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నదని ఆయా సందర్భాలను గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో పండిన ప్రతిగింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, ఆఖరుకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిన సందర్భాలున్నాయని గుర్తుచేస్తూ ‘ఈ ప్రభుత్వానికి ఏం మాయరోగం వచ్చింది? ఎందుకు రైతులను గోసపెడుతున్నది?’ అని నిలదీశారు.
16 మంది రోషం..పౌరుషం లేని ఎంపీలు
పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వేర్పాటువాదంతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. ‘తెలంగాణను అవమానపరుస్తుంటే సిగ్గులేకుండా ఉంటరా? బీజేపీ 8మంది ఎంపీలు, కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నట్టు? రోషం..పౌరుషం లేదా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే కేంద్రమంత్రి పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక్కమాటంటే మన ఎంపీ సురేశ్‌రెడ్డి లేచినిలబడి ఆ మంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టి ‘ఇదిరా తెలంగాణ పౌరుషం’ అని నిరూపించారని గుర్తుచేశారు. ఆ 16 మంది ఎంపీలు ఉండీ ఏం లాభం? అని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్నది ఇద్దరం ఎంపీలమే కదా! అని గుర్తుచేశారు. ‘తెలంగాణ అస్తిత్వం.. తెలంగాణ ఆత్మగౌరవం.. గుండెలో తడి ఉన్న తెలంగాణ బిడ్డలే లోక్‌సభలో ఉండి ఉంటే.. ఆ ఎంపీ తెలంగాణ ఏర్పాటును వేర్పాటువాదంతో పోలుస్తున్నప్పుడు పార్లమెంట్ దద్దరిల్లేది’ అని పేర్కొన్నారు.
ప్రతి విద్యాసంస్థలో బీఆర్ఎస్వీ ఉండాలి
ఇంటర్ కాలేజీ మొదలుకొని యూనివర్సిటీల వరకు అన్ని విద్యాసంస్థల్లో పార్టీ విద్యార్థి విభాగాలు (బీఆర్ఎస్వీ) ఉండాలని కేసీఆర్ చెప్పారు. భవిష్యత్తు తెలంగాణ కోసం వీరంతా పనిచేసేలా ఉండాలని సూచించారు. వీరితోపాటు పార్టీ అన్ని రకాల అనుబంధ సంఘాలు క్రియాశీలకంగా పనిచేయాలని, యువజన, కార్మిక, మహిళా, రైతు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రెండేండ్లలోనే రాష్ర్టాన్ని కాంగ్రెస్ నేతలు ఆగమాగం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయా రంగాలకు చెందిన సంఘాల నేతలు క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, మక్కలు, సోయా వంటి వాటిని రోజుల తరబడి కొంటలేరు. రైతుబంధు రెండు సార్లు ఎగ్గొట్టిండ్రు. యూరియా సక్రమంగా అందడం లేదు. వీటిపై పార్టీ రైతు సంఘాలు పోరాటం చెయ్యాలె. ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర విద్యార్థి, నిరుద్యోగుల హామీలపై విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు పోరాడాలె. ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించుకొని నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఉద్యమాలను మరింత ఉధృతం చెయ్యాలె’ అని పిలుపునిచ్చారు.
ముఖాలుచూసి సీట్లిచ్చుడు ఉండదు
‘బీఆర్ఎస్కు ఉజ్వల చరిత్ర ఉన్నది. తెలంగాణకు కమిటెడ్ పార్టీ. 25 ఏండ్లు ఒక పార్టీ మనుగడ సాగించడం అంటే అల్లాటప్ప విషయం కాదు. తెలంగాణ సాధన విషయంలో వెనక్కి వెళ్తే రాళ్లతో కొట్టి చంపండి అని తెగేసి చెప్పినం. అన్ని గ్రామాలకు తాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడుగబోమని చెప్పినం. అంతటి నిబద్ధత, స్థాయి, ఘన చరిత్ర బీఆర్ఎస్కు ఉన్నది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్లోకి మరిన్ని చేరికలు ఉండబోతున్నయ్. వచ్చే ఎన్నికల్లో మన విజయాన్ని ఆపడం ఎవరితరమూ కాదు. ఇకపై గతంలో మాదిరిగా పరిస్థితి ఉండదు. ముఖం చూసి టికెట్లు ఇవ్వను. క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్లకే టికెట్లు ఇస్తం. ముందే హెచ్చరిస్తున్న. జాగ్రతగా ఉండండి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి’ అని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పైపార్టీ శ్రేణులను కేసీఆర్ అప్రమత్తం చేశారు. ‘సర్’ ప్రక్రియ ద్వారా కొత్త ఓటర్లను చేర్చడంతోపాటు చనిపోయిన వారి పేర్లు తొలగించడం మంచి విధానమే అని అభిప్రాయపడ్డారు. ‘సర్’ ప్రక్రియపై పలువురు నేతలు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేశారు. ‘బూత్‌లెవల్ ఆఫీసర్ (బీఎల్వో)లతో సమన్వయం చేసుకొనేందుకు బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ)ను నియమించుకోవాలి. ఇందుకు ఆయా నియోజకవర్గాల నేతలు బీఎల్ఏ పేర్లు అందించాలి’ అని చెప్పారు. ఇంకా 20 నియోజకవర్గాల నుంచి బీఎల్ఏ పేర్లు పంపలేదని కేటీఆర్ ప్రస్తావించగా ‘ఎందుకు పంపలేదు? పంపించాల్సిందే’ అని ఆదేశించారు. ‘మన వాళ్ల ఓట్లు ఉండేలా చూసుకోవాలి. ఇందుకు కమిటీలు నియమించుకోవాలి. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి’ అని సూచించారు.
సోషల్ మీడియాలోనే కాదు సొసైటీలో ఉండాలి
బీఆర్ఎస్ ప్రజల పక్షాన చేస్తున్న కార్యక్రమాలు సోషల్ మీడియాలోనే కాదు సొసైటీలోనూ విస్తృతం ప్రచారం కల్పించాలని కేసీఆర్ సూచించారు. పార్టీ సోషల్ మీడియాతోపాటు సమాజంలో కూడా బలంగా ఉండాలని చెప్పారు. ‘ఏఐ, సోషల్ మీడియాలను వాడుకోవడంలో తప్పు లేదు. కానీ, మొత్తం సోషల్ మీడియాలోనే ఉంటామంటే కష్టం. కచ్చితంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాల్సిందే. ప్రజలకు అండగా నిలబడాల్సిందే. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనతో విసుగు చెందిన తెలంగాణ ప్రజలు ‘కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని కోరుకుంటున్నారు. ఇది ఊరికే వచ్చింది కాదు. ఒక్క వర్గం కాదు.. అన్ని వర్గాలు కాంగ్రెస్ పాలన పీడనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నయ్. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల బాధితుల తరఫున, ధాన్యం కొనుగోలు జరుగక ఇబ్బందులు పడుతున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో కొట్లాడుతున్నది. రాబోయే రోజల్లో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలి’ అని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు హాజరయ్యారు. సుమారు గంటపాటు నిలబడి పార్టీ శ్రేణులకు సూచనలు, సలహాలిచ్చిన కేసీఆర్.. మరో 30 నిమిషాలు కూర్చొని ప్రసంగించారు. మళ్లీ 15 నిమిషాలు నిలబడి పార్టీ నేతల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం తమ వెంట నడుస్తున్న ప్రతి ఒకరికీ ధన్యవాదాలు తెలిపారు.
బలమైన దీక్షతో పార్టీ ఏర్పాటు
పార్టీ ఏర్పాటు చేసిననాడు ఉన్న దుర్భరమైన తెలంగాణ పరిస్థితిని, నాటి రాజకీయ ముఖచిత్రం గురించి కేసీఆర్ వివరంగా తెలియజేశారు. ఎంతో ధైర్యం, బలమైన దీక్షతో ఆనాడు పార్టీని ఒకడిగా ఏర్పాటు చేసి 25 ఏండ్లపాటు తెలంగాణ కోసం సాగించిన పోరాటం, ఉద్యమం, ప్రభుత్వ పరిపాలనా పరిణామక్రమాన్ని వివరించారు. ‘14 ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణను పదేండ్ల పాలనలో అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబెట్టుకున్నం. నాడు తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుకున్నం. ప్రభుత్వాలు రైతుల నుంచి శిస్తు వసూలు చేసేవి. రైతులకు ఏ ప్రభుత్వాలు కూడా రూపాయి ఇవ్వలే. కానీ, మన ప్రభుత్వం ఏర్పడగానే విప్లవాత్మకంగా రైతుబంధు పథకం తెచ్చినం. మన రైతు బంధు పథకాన్ని యూఎన్వో సైతం ప్రశంసించింది’ అని గుర్తుచేశారు.
మనం బంపర్ మెజారిటీతో గెలుస్తం
‘వచ్చే ఎన్నికల్లో మనం బంపర్ మెజారిటీతో గెలుస్తం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రజల పక్షాన పోరాడుతూనే పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలి. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు మనకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఉన్నరు అనుకుంటే ఫలితం రాదు. రాశికంటే వాసి ముఖ్యం.. తెలంగాణ రక్షణ కవచంగా గులాబీ సైన్యం తయారుకావాలి. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పార్టీలు. తెలంగాణకు ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే.. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి’ అని పిలుపునిచ్చారు. ‘పార్టీ అంటే కేవలం ఎన్నికల మెషీన్ కాదు.. అన్యాయంపై ఎగిసిపడే సైన్యంలా ఉండాలి. అలాంటి కమిటెడ్ క్యాడర్ కావాలి’ అని సూచించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు అద్భుతంగా పురోగమించి తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిన స్థితి నుంచి ఇవ్వాళ దీనస్థితికి వెళుతూ తిరోగమనంలో పయనిస్తున్నది. మన హయాంలో అన్నింట్లో నంబర్ వన్ ఉంటే ఈ ప్రభుత్వం భూ కబ్జాల్లో నంబర్ వన్, కూలగొట్టుట్లో నంబర్ వన్. పేదల నోట్లో మట్టిగొట్టుట్లో నంబర్ వన్, రైతుబంధు ఎగబెట్టుట్లో నంబర్ వన్‌గా ఉన్నది. –
కేసీఆర్
పార్లమెంట్లో తెలంగాణను అవమానపరిస్తే సిగ్గులేకుండ ఉంటరా? బీజేపీ 8 మంది, కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నట్టు? రోషం..పౌరుషం లేదా? అదే కేంద్రమంత్రి పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక్కమాటంటే మన ఎంపీ సురేశ్‌రెడ్డి లేచినిలబడి ఆ మంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టి ‘ఇదిరా తెలంగాణ పౌరుషం’ అనినిరూపించిండ్రు. కానీ, ఆ 16 మంది ఎంపీలు ఉండీ ఏం లాభం?
-కేసీఆర్
వచ్చే ఎన్నికల్లో మనదే విజయం .మన విజయాన్ని ఆపడం ఎవరితరమూ కాదు. ఇకపై గతంలో మాదిరిగా పరిస్థితి ఉండదు. ముఖం చూసి టికెట్లు ఇవ్వను. క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్లకే టికెట్లు ఇస్తం. ముందే హెచ్చరిస్తున్న. జాగ్రతగా ఉండండి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనండి.
-బీఆర్ఎస్ క్యాడర్‌కు కేసీఆర్ ఆదేశాలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందుచూపుతో రాజ్యాంగంలో పొందుపరచిన అంశాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా 125 అడుగుల విగ్రహం పెట్టుకొని, తెలంగాణ ఖ్యాతిని సమున్నతంగా నిలుపుకోవాలనే సచివాలయం కట్టుకున్నం. ఆ మహనీయుడి పేరుతో బర్కతి ఉంటుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అని పేరుపెట్టుకున్నం. రెండున్నరేండ్లుగా అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించే వీల్లేకుండా చేసిండ్రు. ఇంత మూర్ఖమైన.. చండాలమైన ప్రభుత్వం ఉంటదా?
-కేసీఆర్
బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశం తీర్మానాలివే..

తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను ఆప్యాయంగా పలుకరిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్. చిత్రంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

వేదికపైకి కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్న సురేశ్‌రెడ్డి. చిత్రంలో కేటీఆర్, బండా ప్రకాశ్, జీవన్‌రెడ్డి

సోమవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ముఖ్యనేతల సమావేశంలో
మాజీమంత్రి జీవన్‌రెడ్డితో పార్టీ అధినేత కేసీఆర్