తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నదే నదీ జలాల కోసం. వాటిలోనే అన్యాయం జరిగితే ఇక్కడి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. రాష్ట్ర విభజన చట్టం కాలపరిమితి త్వరలోనే ముగుస్తుంది. ఆ చట్టంలోని అంశాలను మరోసారి పార్లమెంటులో ప్రస్తావించాలి. వాటిని సాధించే ప్రయత్నం చేయాలి. పెండింగ్ హామీలను సాధించేందుకు పోరాడాలి. రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఆయిల్‌పామ్‌కు కనీస మద్దతు ధరను నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
– బీఆర్ఎస్ ఎంపీలతో అధినేత కేసీఆర్
KCR | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒకటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ హక్కుల సాధన కోసం పార్టీ ఎంపీలు గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు వారికి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని సూచించారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతోపాటు పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని గుర్తుచేశారు. నాడైనా నేడైనా తెలంగాణ హకులకు భంగం వాటిల్లకుండా కాపాడలవలసిన బాధ్యత బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ‘తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నదే నదీ జలాలకోసం. వాటిలోనే అన్యాయం జరిగితే ఇక్కడి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. రాష్ట్ర విభజన చట్టం కాలపరిమితి త్వరలోనే ముగుస్తుంది. ఆ చట్టంలోని అంశాలను మరోసారి పార్లమెంటులో ప్రస్తావించాలి. వాటిని సాధించే ప్రయత్నం చేయాలి. ఇంకా అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని సాధించేందుకు చర్యలు చేపట్టాలి. అయిల్‌ఫాం సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం ఆయిల్‌పాం సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. అయిల్పాంకు కనీస మద్దతు ధరను నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి’ అని ఎంపీలకు కేసీఆర్ సూచించారు.
కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రిని కలుస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్‌తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం సరికాదని, అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తూ సంతకాలు పెట్టిందని విమర్శించారు. కేంద్రం దీనికి సంబంధించిన మినిట్స్ కూడా బయట పెట్టిందని, కృష్ణా జలాల్లో మన వాటా తేలకుండా బోర్డుకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయా డ్యామ్‌లపైకి తెలంగాణ అధికారులు అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గతంలోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామని గతంలో అమిత్ షా హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. బీసీ జన గణన చేపట్టాలని పార్లమెంటులో గట్టిగా గొంతు వినిపిస్తామని తెలిపారు.
ఎన్నికల హామీలు అమలు చేయాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సహనం కోల్పోతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ఉచ్చ ఆగడం లేదా? అని ఒకరు, చెప్పుతో కొడతామని మరొకరు అంటున్నారని, వారికి ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ‘కాంగ్రెస్ నేతలు జర్నలిస్టులపైనా, ప్రతిపక్షాలపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాపై బురద జల్లడం మాని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో దృష్టి సారించండి. ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల అమలుకు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జీవోలు ఇవ్వాలి. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే దుం దుడుకు స్వభావంతో మాట్లాడుతున్నారు. అహంకారం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌పట్ల మీ భాష ఇలాగేనా ఉండేది? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీకు గుణపాఠం చెప్తారు. మార్చి 17కి ప్రభుత్వానికి వంద రోజులు నిండుతాయి. అంతలోపు ఎన్నికల కోడ్ వస్తుంది. మహిళలకు ఒక్క హామీ అమలుచేసి అన్నీ ఇచ్చేశామంటే కుదరదు. ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంచేయాలి’ అని డిమాండ్ చేశా రు. విభజన హామీలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వర్రావు, ఎంపీలు రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి, వెంకటేశ్ నేత, బడుగుల లింగయ్య, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథిరెడ్డి, సంతోష్‌కుమార్, దీవకొండ దామోదర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు.