హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ ) : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వరిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆయన ఆదేశించారు. కాగా, కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ఉద్యమకారుల్లోనూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ భావజాలవ్యాప్తిలో ముందు నుంచి బలమైన గొంతును వినిపించిన నాయకుడిగా దాసోజు శ్రవణ్‌కు పేరుంది. నిజానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి నుంచి నలుగురైదుగురు సీనియర్ల పేర్లు వినిపించాయి. పార్టీ అధినేత కేసీఆర్ అన్నివర్గాలు, అన్నిస్థాయిల ముఖ్యనేతలతో సమాలోచనలు చేశారు. చర్చోపచర్చల అనంతరం ‘ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించాలి’ అని కేసీఆర్ నిర్ణయించి దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
అదే సమయంలో సీనియర్ నాయకుల సేవలను పార్టీలో క్రియాశీలకంగా వినియోగించుకోవటమే కాకుండా సమీప భవిష్యత్తులో చట్టసభల్లో వారికి అవకాశాలు ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. కొత్తతరాన్ని ప్రోత్సహించటం, పార్టీకి సేవ చేస్తున్నవారిని ఆదరించటం అన్నది బీఆర్ఎస్ మొదటి నుంచి పాటిస్తున్న ఆదర్శానికి నిదర్శనమని దాసోజు శ్రవణ్ ఎంపికలో మరోసారి స్పష్టమైందని పార్టీ శ్రేణులు ఉదహరిస్తున్నాయి. ‘ఒక అభ్యర్థిని చట్టసభలకు ఎంపిక చేయటం వెనుక పార్టీ అధినాయకత్వానికి అనేక అంశాల ప్రాతిపదిక ఉంటుంది. అన్నీ బేరీజు వేసుకొని అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇప్పుడూ అలానే ప్రకటించారని అనిపిస్తున్నది’ అని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆశావహుల్లో ఒకరు పేర్కొనటం విశేషం. ‘ఇప్పుడు అవకాశం రానంతమాత్రాన నిరుత్సాహపడం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత బలంగా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. సీట్ల సంఖ్య పెరుగుతుంది. అప్పుడు మాకూ అవకాశాలు వస్తాయి’ అని సదరు నేత పేర్కొనటం బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు సంకేతం.
ఉద్యమకారుడు, బీసీ వర్గానికి చెందిన నాయకుడు దాసోజు శ్రవణ్, సత్యనారాయణను కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గతంలో ఎంపిక చేసింది. నాటి గవర్నర్ తమిళి సై వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. అణగారిన, బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపినా నాటి గవర్నర్ తొక్కిపెట్టారు. రాష్ట్ర గవర్నర్‌గా ఉంటూ బీజేపీ ఎంజెడాను అమలు చేసి నాటి కేసీఆర్ ప్రభుత్వంపై కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా దాసోజు శ్రవణ్ వంటి బీసీ బిడ్డకు అవకాశం కల్పించాలనే సంకల్పం నుంచి దూరం కాలేదని తాజా నిర్ణయం చాటిచెప్పటం విశేషం.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో దాసోజు శ్రవణ్ క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట ప్రధాన అనుచరుడిగా పనిచేశారు. అనేక వేదికల మీద తెలంగాణ భావజాలవ్యాప్తికి కృషి చేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో బడుగుల గొంతుకను వినిపించారు. బీసీ కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో భాగంగా ఇటు పార్టీ పక్షాన, అటు న్యాయవాదిగా తన వాదనను బలంగా వినిపించారు. కులగణన చేయాలని కోర్టులో కేసు వేసిన తొలి నాయకుడిగా బడుగుల మనసులు గెలిచారు.
పుట్టిన తేదీ: 1966 జూన్ 7
కులం: విశ్వకర్మ (బీసీ)
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1987లో విద్యార్థి నాయకుడిగా, ఆర్ట్స్ కళాశాల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. టెక్‌మహీంద్రా, హిటాచీ తదితర కంపెనీల్లోనూ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ డైరెక్టర్ సహా పలు ఉన్నత హో దాల్లో పనిచేశారు. సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు.