సంగారెడ్డి, నవంబర్ 16 ( నమస్తే తెలంగాణ) : కేసీఆర్‌ను, హరీశ్‌రావును విమర్శించకుంటే కవితకు పొద్దుగడవడం లేదని, ఆమె ఎవరి లాభం కోసం మాట్లాడుతున్నదో ప్రజలకు అర్థమవుతున్నదని, కాంగెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి మేలు కలిగేలా కవిత వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్‌పై, హరీశ్‌రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. రేవంత్‌రెడ్డితో వ్యాపారలావాదేవీలను కొనసాగించేందుకు కవిత బీఆర్ఎస్పై, హరీశ్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌కు మేలు చేయాలనుకుంటే కవిత నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటే సరిపోతుందని ఎద్దేవాచేశారు. కన్నతండ్రి అయిన కేసీఆర్‌ను, అన్న కేటీఆర్‌ను, మాజీ మంత్రి హరీశ్‌రావును పదేపదే విమర్శిస్తే ఇకపై సహించేది లేదని హెచ్చరించారు.
నిజామాబాద్‌లో చెల్లని రూపాయి మెదక్‌లో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపీగా పోటీచేసి కవిత ఓటమి పాలైందని గుర్తుచేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినందునే నిజామాబాద్ ప్రజలు కవితను ఓడించినట్టు చెప్పారు. మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా తాను ఒక్కరే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. కర్మ గురించి వ్యాఖ్యలు చేస్తున్న కవిత తనగురించి ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. జైలుకు వెళ్లడం, ఎంపీగా ఓడిపోవడం, బీఆర్ఎస్ వెన్నుపోటుదారుగా మిగిలిపోవడం కవిత కర్మ కాదా? అని ప్రశ్నించారు. కవిత ఎవరు వదిలిన బాణమనేది ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ కవితను క్షమించదని ధ్వజమెత్తారు. హరీశ్‌పై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేస్తూ కవిత క్షమించరాని తప్పులు చేస్తున్నదని, ఇకనైనా ధోరణి మార్చుకోకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదని హెచ్చరించారు. ఆమె బేషరతుగా హరీశ్‌రావుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ వల్లే తెలంగాణ ప్రజలు కవితకు గౌరవం ఇస్తున్నారన్న విషయాన్ని ఆమె గుర్తించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు సూచించారు. కవిత చర్యలు బీఆర్ఎస్కు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. జైలుకు వెళ్లినా కవితకు ఇంకా బుద్ధిరావడంలేదని మండిపడ్డారు. గర్వం వల్లే కవిత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన వ్యాపారాల కోసం కవిత రేవంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరించడం సిగ్గు చేటని మండిపడ్డారు. కవిత తీరును ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని, ఇకనైనా ఆమె తీరు మార్చుకోవాలని హితవుపలికారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అక్రమంగా గెలిచిన రేవంత్‌రెడ్డిపై పోరాటం చేయాల్సింది పోయి కవిత హరీశ్‌రావును టార్గెట్ చేయడం సరికాదని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ చెప్పారు. కవిత వెనక ఎవరున్నారనేది అందరికీ అర్థమవుతున్నదని, రాజకీయ దురుద్దేశంతోనే ఆమె పదేపదే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌పై అర్థంలేని విమర్శలు చేస్తున్నదని విమర్శించారు. కవిత కేసీఆర్ కూతురు కావడం వల్లే ఎక్కువ విషయాలు మాట్లాడలేకపోతున్నామని, ఇకనైనా ఆమె తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు జైపాల్‌రెడ్డి, డా.శ్రీహరి, సాయికుమార్, ఆర్ వెంకటేశ్వర్లు, విఠల్, విజయ్, మనోహర్‌గౌడ్ పాల్గొన్నారు.