హైదరాబాద్: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దుచేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత (Kavitha) డిమాండ్ చేశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టి వేయబడ్డాయని చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించిందని విమర్శించారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం ఆక్షేపనీయమన్నారు. గ్రూప్ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలున్నాయని చెప్పారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం నెలకొందన్నారు.
జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వెల్లడించారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
లేఖ పూర్తి పాఠం..
‘తెలంగాణ యువతకు, మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన మీరు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపనీయం. గ్రూప్- 1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్వక్ష్యం వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయి. గ్రూప్- 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిలో అనేక లోపాలు, అవకతవకలు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదంటే పారదర్శకంగా ఉద్యోగ నియామకాల పట్ల మీకు ఏ మేరకు చిత్తశుద్ది ఉందో తేటతెల్లమవుతుంది. ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారి లోపించిందన్న విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై నిరుద్యోగుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు ఒక హాల్ టికెట్ ఇష్యూ చేసిన టీజీపీఎస్సీ అధికారులు, మెయిన్స్ పరీక్షకు వేరే హాల్ టికెట్ జారీ చేశారు. సాధారణంగా ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు అదే హాల్ టికెట్ నంబర్ తో మెయిన్స్ పరీక్షలకు అప్పియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రిలిమినరీ పరీక్షల హాల్ టికెట్లు కాకుండా కొత్తగా జారీ చేసిన హాల్ టికెట్లతో మెయిన్స్ నిర్వహించడంపై మొదటి నుంచే అనేక సందహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయకుండానే మెయిన్స్ పరీక్షల తంతు ముగించారు. గ్రూప్ -1 పరీక్షలపై అభ్యర్థులు దాఖలు చేసిన కేసులు న్యాయస్థానాల పరిధిలో ఉండగానే గౌరవ ముఖ్యమంత్రి గారైన మీరు, మీ కేబినెట్ లోని పలువురు మంత్రివర్యులు గ్రూప్ -1 నియమకాల గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. త్వరలోనే ఈ నియామకాల ప్రక్రియ ముగించబోతున్నట్టు ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు కూడా అభ్యర్థుల్లో అనుమానాలు పెరగడానికి కారణమయ్యాయి.
గ్రూప్ -1 పరీక్షలపై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన గౌరవ తెలంగాణ హైకోర్టు తాము తుది ఆదేశాలు ఇచ్చే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు ఇవ్వొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. 563 గ్రూప్ -1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను 1 : 50 నిష్పత్తిలో ఎంపిక చేశామని టీజీపీఎస్సీ ప్రకటించింది. వారిలో 21,075 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని పరీక్షల అనంతరం ప్రకటన చేసింది. ఫలితాలు ప్రకటించే సరికి ఆ అభ్యర్థుల సంఖ్య 21,085 మందికి చేరింది. అంటే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారని చెప్తున్న వారి సంఖ్య పదికి పెరిగింది. ఈ పెరిగిన పది మంది ఎక్కడి నుంచి వచ్చారనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. ఉర్దూ మీడియంలో 9 మంది పరీక్షకు హాజరయ్యారని మొదట చెప్పిన టీజీపీఎస్సీ ఆ తర్వాత ఆ సంఖ్యను 10కి పెరిగింది. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయి ? సదరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్ పరీక్షలకు అప్పియర్ అయ్యారా లేదంటే తర్వాత వారిని తెచ్చి చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొన్నది.
అభ్యర్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో పని చేస్తున్న నిపుణులైన ప్రొఫెసర్లతో వ్యాల్యుయేషన్ చేయిస్తామని మొదట ప్రకటించిన టీజీపీఎస్సీ రిటైర్డ్ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపైనా అభ్యర్థుల్లో అనుమనాలున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 45 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన టీజీపీఎస్సీ తర్వాత ఒక సెంటర్ పెంచి 46 కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు పరీక్ష కేంద్రాల్లో 71 మంది ఉద్యోగాలకు ఎంపికైనది నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించింది. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసింది. ”నీళ్లు – నిధులు – నియామకాలు” తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని గౌరవ ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని కోరుతున్నాను. అభ్యర్థుల్లో నెలకొన్న అనేక సందేహాల నేపథ్యంలో గ్రూప్ -1 నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.’