హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో ఎంతగానో అభివృద్ధి చెందిన ఆదివాసీ గూడేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అభివృద్ధికి దూరమై ఆగమయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఏడాదిలో గూడేలన్నీ అభివృద్ధికి దూరమయ్యాయని, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ ఆదివాసీ హకులు, సమస్యలపై చేస్తున్న పోరాట ఫలితంగానే ఆదివాసీ సంఘాల నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై హామీలు ఇచ్చారని తెలిపారు. ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని చెప్పారు. ఆ హామీలను అమలు చేయకుంటే బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. తక్షణమే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు కుదేలయ్యాయని, విద్యార్థులు భయపడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు. గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు మృతి చెందుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఐటీడీఏ వ్యవస్థను పటిష్టం చేసి ఆదివాసీ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు.
తాగునీటి వ్యవస్థ నిర్వీర్యం..సీజనల్ వ్యాధులతో సతమతం
ఆదివాసీ గూడేల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్వీర్యమైందని, సీజనల్ వ్యాధులతో ఆదివాసీలు సతమతమవుతున్నారని కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్‌తో కలిసి బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని ఆదివాసీ గూడేలను సందర్శించానని తెలిపారు. ఆ సందర్భంగా ఆదివాసీలు ఎదురొంటున్న అనేక కష్టాలను స్వయంగా తాము చూశామని తెలిపారు. సీజనల్ వ్యాధుల కారణంగా అనేకమంది మరణించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని, సకాలంలో వైద్యం అందించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు.