హైదరాబాద్: ఎండల వల్లే రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. గతేడాది వర్షాలు సమృద్ధిగా పండాయని, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయ ద్వారా కేసీఆర్ చెరువులు నింపారన్నారు. ఎండిన పంటలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండలి ఆవరణలో కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు కింద ఉన్న పొలాలు కూడా ఎండిపోతున్నాయన్నారు. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కృష్ణా నది నుంచి 10 వేల క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్లు పెరిగాయని చెప్పారు. కేసీఆర్ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారని, ఆయన మీద కోపంతో ఆ నీళ్లు వాడుకోకపోవడం సరైనది కాదని వెల్లడించారు. ఇప్పటికైనా ఉన్న నీటి వనరులు వాడుకొని రైతులకు నీళ్లు ఇవ్వాలని సూచించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.