MLC Kavitha | ఆఖరి నిమిషం దాకా అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా.. భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీ వేదికగా మహిళా రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన ఒక రోజు నిరాహారదీక్ష నిర్విఘ్నంగా విజయవంతమైంది. కవిత సంకల్పం ముందు కేంద్రం కుయుక్తులు కుదేలయ్యాయి. దేశం నలుమూలల నుంచి కదిలి వచ్చిన వివిధ పార్టీల నాయకుల మద్దతుతో ఈ దీక్ష.. దేశ వ్యాప్త వివక్షాల ఐక్యతకు సంకేతంలా నిలిచింది.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా ఇచ్చే బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదించాలంటూ జంతర్‌మంతర్‌లో కవిత చేపట్టిన దీక్షకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ నేత కే నారాయణ, ఆమ్ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్, ఆర్జేడీ నేత, బీహార్ మాజీ మంత్రి శ్యామ్ రజాక్, శిరోమణి అకాళీదళ్ నేత నరేశ్ గుజ్రాల్, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణీ అలీ, ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధి సీమా మాలిక్, సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి పూజా శుక్లా, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, బీఆర్ఎస్ లోకసభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతీరాథోడ్, ఎంపీ మాలోత్ కవిత సహా 18 పార్టీలకు చెందిన నేతలంతా ముక్తకంఠంతో కల్వకుంట్ల కవిత పోరాటానికి మద్దతు ప్రకటించారు.
సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాథ్ హై అంటూ పెద్ద ఎత్తున నినదించారు. దీంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ పరిసరాలు దద్దరిల్లిపోయాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేదాక పోరాటం ఆపే ప్రసక్తే లేదని, ఇది కేవలం ఆరంభమేనని, దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమని కేంద్రాన్ని హెచ్చరిస్తూ కవిత దీక్ష ముగించారు.
ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును 27 ఏండ్లు గడిచినా లోక్‌సభలో ప్రవేశ పెట్టకపోవడం సిగ్గుచేటు. బీజేపీకి లోక్‌సభలో, రాజ్యసభలో పూర్తి మెజారిటీ ఉన్నది. బీజేపీ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని అన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయి. అయినా ఇంకా ఆలస్యం ఎందుకు?
– భారత జాగృతి నేత కవిత
ఢిల్లీ, మార్చి 10 (నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్ పోరాటంలో ఆఖరు వరకు పోరాట యోధురాలు కవిత వెంట ఉంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహిళాబిల్లు ఆమోదించాలంటూ చేపట్టిన ఒక రోజు నిరాహారదీక్షను ప్రారంభిస్తూ సీతారాం ఏచూరి ప్రసంగించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు తగినంత భాగస్వామ్యం లేనంత వరకు సమాజంలో అభివృద్ధి జరుగబోదని తేల్చిచెప్పారు. మహిళా భాగస్వామ్యం లేని ఏ దేశమూ ఆర్థికంగా పురోగతి సాధించలేదని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ పోరాటంలో సీపీఎంతోపాటు వామపక్ష పార్టీలన్నీ భారత జాగృతి వెంట నిలుస్తాయని ప్రకటించారు. ఎన్నో అడ్డంకుల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు 27 ఏండ్ల కింద రాజ్యసభలో ఆమోదం పొందినా, లోకసభలో ఆమోదం పొందలేకపోవటం విచారకరమని తెలిపారు. మోదీ మొదటిసారి పార్లమెంటుభవన్లో అడుగుపెట్టే ముందు మహిళలకు రిజర్వేషన్ బిల్లు తమకు ఎంతో ప్రాధాన్యంతో కూడినదని చెప్పారని, కానీ ఇంతవరకు తన హామీ నెరవేర్చలేదని విమర్శించారు. రానున్న పార్లమెంటు సమావేశంలో మహిళాబిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. 9 ఏండ్లు గడిచినా మోదీ ప్రభుత్వం మహిళా బిల్లు ఊసెత్తటం లేదని, ఈ పోరాటంలో తాము ఆఖరువరకు బీఆర్ఎస్తోనూ, భారత్ జాగృతితోనూ కలిసి నడుస్తామని, పంచాయతీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తుంటే, అసెంబ్లీ, పార్లమెంటుల్లో ఎందుకు కల్పించరాదో ప్రధాని మోదీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రారంభోపన్యాసంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తాను సీబీఐకి, ఈడీలకు భయపడనని, మహిళలకు హక్కులు కల్పించేంతవరకు ఎత్తిన పిడికిలి దించనని ప్రకటించారు. భారతీయ సంస్కృతిలో అమ్మానాన్న అని సంబోధిస్తారని, పిలుపులో కూడా అమ్మకే ప్రథమస్థానమని, మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కవిత, పార్టీలకతీతంగా మహిళా రిజర్వేషన్‌కు కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాగాంధీ, బృందాకారత్, సుష్మస్వరాజ్ లాంటి మహిళా నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని దేవేగౌడ హయాంలో 1996లో మహిళాబిల్లు రిజర్వేషన్ రాజ్యసభలో ఆమోదం పొంది 27 ఏండ్లు గడిచినా లోకసభలో ప్రవేశపెట్టక పోవడం సిగ్గుచేటని విమర్శించారు.
లోకసభలో బీజేపీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే అన్ని రాజకీయపార్టీలు మద్దతునిస్తాయని, ఇప్పటికే తమ పోరాటానికి 18 పార్టీలు మద్దతును ప్రకటించాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్‌బిల్లు వల్ల కొందరు నాయకుల సీట్లు గల్లంతవుతాయని అనుకుంటే నియోజకవర్గాలను పెంచవచ్చని అభిప్రాయ పడ్డారు. మహిళా రిజర్వేషన్లబిల్లు ఆమోదించటం చారిత్రక అవసరంగా అభివర్ణించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంట్లో ఆమోదించేవరకు తమ పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమేనని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌బిల్లు ప్రవేశ పెట్టకపోతే, ఆందోళనను దేశవ్యాప్తంగా చేపడతామని ప్రకటించారు. చాకలి ఐలమ్మ, మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి పోరాటధీరుల స్ఫూర్తితో పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని తెలిపారు. రాజ్యసభలో 27 ఏండ్ల కింద ఆమోదం పొందిన మహిళాబిల్లు ఇంతవరకు లోక్‌సభలో ఎందుకు ప్రవేశ పెట్టలేదని, అసలు బీజేపీ ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ది ఉందా? అని ప్రశ్నించారు. పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీకి మహిళా రిజర్వేషన్‌బిల్లు పాస్ చేయడం పెద్ద పని కాదన్నారు.
1992లో స్థానికసంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారని, 21 రాష్ర్టాల్లో మహిళలు 50 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌తోపాటు మరో ఈశాన్య రాష్ట్రంలో తప్ప అన్ని రాష్ర్టాలలో స్థానిక సంస్ధల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని చెప్పారు. చట్టసభల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే 50 శాతం ప్రాతినిధ్యం వహించడానికి మహిళలకు మరో 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఈనెల 13 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేటు ఒత్తిడి తీసుకురావటానికి అన్ని పార్టీలు ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ఎన్నికల ముందు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నదని, స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నదని ఆరోపించారు. మహిళాబిల్లు ప్రవేశపెడితే ఏ ఏ రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతాయో, లేదో? తేలిపోతుందని చెప్పారు. ఇప్పటికే 18 పార్టీలు తమ ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించిన విషయాన్ని ఉద్ఘాటించారు. ఈ పోరాటం తమ ఒక్క రాష్ర్టానికే చెందినది కాదని, మహిళలందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు రావాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ధర్నాలో పాల్గొన్న వారందరూ తమ ఆందోళనకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారని, సంతకాలతో కూడిన విజ్ఞప్తిని రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి పంపించనున్నట్టు కవిత చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఒక మహిళ కావటాన, చొరవతీసుకుని మహిళలపక్షాన నిలబడాలని, మహిళా రిజర్వేషన్‌బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్పార్టీ సెక్రటరీజనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు సాయంత్రం 4 గంటలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
కవిత చేస్తున్న పోరాటానికి తెలంగాణ మహిళా సమాజం మాత్రమే కాదు దేశంలోని ప్రతి మహిళ అండగా నిలబడుతున్నదని, తామంతా కవిత వెంట ఉన్నామని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే పోరాటంలో కవిత కృషి తప్పకుండా ఫలిస్తుందని నొక్కి చెప్పారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒక మహిళామంత్రిగా కాకుండా ఒక పేదింటి బిడ్డగా మద్దతు ఇస్తున్నానని చెప్పారు. రిజర్వేషన్ సాధించేవరకు కవితకు తోడుగా ఉండాలని దేశవ్యాప్తంగా ఉన్న బంజారా ఆదివాసీలకు మంత్రి పిలుపునిచ్చారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంమీదే ఉన్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. దశాబ్దాలుగా మహిళాబిల్లు ఆమోదానికి నోచుకోకుండా ఉన్నదని తెలిపారు. మహిళలపక్షాన ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిందని చెప్పారు. కవిత పోరాటానికి దేశంలోని అన్ని రాజకీయపార్టీలు అండగా నిలిచాయని తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళాలోకం తిరుగుబాటు చేయకముందే కేంద్రం మేల్కోవాలని ప్రధానికి హితవు చెప్పారు. ఎమ్మెల్సీ కవిత ఏ అంశాన్ని ఎత్తుకున్నా దాన్ని సాధించేదాకా విడిచిపెట్టరని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు దేశంలోని అన్ని వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నాయని ఎంపీ మాలోత్ కవిత తెలిపారు. మోదీ, ఈడీ, సీబీఐ దాడులకు బీఆర్ఎస్ నేతలుగా తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. మహిళాబిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత ఉద్యమాన్ని చేపడితే కేంద్రానికి భయమెందుకు అని ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్ కోసం దీక్ష చేస్తున్న దేశ మహిళల తరపున ఎమ్మెల్సీ కవితకు ఆర్జేడీ నేత, మాజీ మంత్రి శ్యాం రజాక్ ధన్యావాదాలు తెలిపారు. తమ పార్టీ నేత లాలూ ప్రసాద్‌యాదవ్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిచ్చారని గుర్తుచేశారు. బీహార్ జిల్లాపరిషత్, పంచాయతీల్లో దళిత, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. స్థానికసంస్థల్లో చట్టాలు చేసినప్పుడు చట్టసభల్లో ఎందుకు చేయరని ప్రశ్నించారు. బీజేపీ గోబెల్స్ ప్రచారంలో రాటుతేలిందని, ఆ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. తాము ఎమ్మెల్సీ కవితకు అండగా ఉంటామని ప్రకటించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మహిళాబిల్లును తీసుకురావాలని, తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు.
మహిళా రిజర్వేషన్‌బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత ఒంటరిగా పోరాటం చేయటం లేదని, ఆమె వెనుక యావత్‌దేశం ఉన్నదన్న సంగతిని విస్మరించకూడదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సైద్ధాంతికంగా కమ్యూనిస్టులుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ విష సంస్కృతిని వ్యతిరేకిస్తామని, అయితే మహిళా బిల్లు విషయంలో పార్లమెంట్లో బిల్లు పెడితే తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన తేల్చిచెప్పారు. నరేంద్రమోదీకి దమ్ముంటే మహిళా బిల్లు పెట్టాలన్నారు. యూపీఏ హయాంలో సంఖ్యాపరంగా కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు ఉండటం వల్ల, సంకీర్ణ ప్రభుత్వం ఉండటంతో అప్పుడు బిల్లు వీగిపోయిందని ఆయన గుర్తుచేశారు. అదే ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నదని పేర్కొన్నారు. మోదీ తలచుకుంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు వస్తుందని తెలిపారు. అయితే మహిళాబిల్లు తేవటం బీజేపీకి ఇష్టంలేదని, అందుకే ప్రభుత్వం స్పందించటం లేదని చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టకపోతే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్, వామపక్షాలు ఇతర భావసారుప్య పార్టీలను ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. మోదీ హఠావో… దేశ్ బచావో నినాదంతో ఉద్యమిస్తామన్నారు.
మహిళా రిజర్వేషన్ కోసం ఎమ్మెల్సీ కవిత ప్రారంభించిన ఆందోళనకు బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ్య నాయకుడు కే కేశవరావు పూర్తి మద్దతు ప్రకటించారు. తాము కూడా ఈ నెల 13 నుంచి ప్రారంభకానున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళాబిల్లు విషయాన్ని లేవనెత్తి బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే సమావేశంలో బిల్లుపై చర్చించటానికి పట్టుపడతామని, బీజేపీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే, ఈబీసీ రిజర్వేషన్లను సైతం ఎలా అమలు చేయవచ్చో ఆలోచించవచ్చని చెప్పారు. బీఆర్ఎస్ త్వరలోనే దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నదని, తాము మహిళల రిజర్వేషన్లు సాధించేవరకు విశ్రమించబోమని, కవిత ఆందోళనను మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పారు.
పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదించేదాకా కేంద్రాన్ని విడిచిపెట్టేదిలేదని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు స్పష్టం చేశారు. 15వ పార్లమెంటు సమావేశాల్లోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళాబిల్లు ఆమోదం పొందేందుకు తామెంతో ప్రయత్నించామని చెప్పారు. అప్పుడు ఎన్నికలు రావటంతో అది సాధ్యం కాలేదని వివరించారు. అప్పుడు స్పీకర్‌గా మీరాకుమారి, కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ నేత సోనియాగాంధీ, బీజేపీ పార్లమెంట్ నేత సుష్మా స్వరాజ్ ఇలా కీలక పదవుల్లో ముగ్గురు మహిళా నాయకురాళ్లు ఉండగా మహిళా బిల్లు ఆమోదం చెందితే బాగుంటుందని తాము తీవ్రంగా ప్రయత్నించిన సంగతిని గుర్తుచేశారు. సౌత్ కొరియా, చైనా, నేపాల్ వివిధ దేశాల్లో కల్పిస్తున్న మహిళా రిజర్వేషన్ల గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దశాబ్దాలు దాటినా మన దేశంలో మహిళాబిల్లు చట్టబద్ధత పొందకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్‌బిల్లును వెంటనే ఆమోదించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. దేశంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని, రాష్ట్రంలోని ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఒక కీలకమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలని లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ సాధన కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత ఢిల్లీలో చేపట్టిన దీక్షకు మద్దతుగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక రాష్ర్టాలకు చెందిన వివిధ పార్టీలు, మహిళా సంఘాలు, మేధావులు మద్దతు ప్రకటించారని తెలిపారు. చట్టసభల్లో రిజర్వేషన్ల అంశం పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిధిలో ఉన్నదని, ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రధాని మోదీ.. తన మిత్రుడు అదానీకి ఆకాశం నుంచి పాతాళం వరకు అన్నీ రాసిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్ ఆరోపించారు. బొగ్గుగనుల నుంచి రోడ్లు, విమానాల వరకు, స్టీల్ నుంచి సిమెంట్ వరకు అన్నీ అదానీకి కట్టబెడుతున్నారని ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. కోట్ల ప్రజాధనాన్ని రుణాలమాఫీ పేరిట దోచిపెడుతున్నారని లెక్కలతో సహా వివరించారు. సామాన్యులకు మాత్రం మొండిచేయి చూపుతూ గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ సంపన్నుల గురించి తప్ప సామాన్యులను పట్టించుకోరని విమర్శించారు. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ఎన్నికల కమిషన్ కన్నా ముందు ఈడీ, సీబీఐ, ఐటీలను పంపే విషసంస్కృతిని మోదీ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. ఇదేమని అడిగితే ప్రతిపక్షాలపై సీబీఐని, ఈడీని ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎంత పెద్ద అవినీతిపరుడైతే అంత పెద్ద పదవిని మోదీ కట్టబెడుతున్నారని విమర్శించారు. తాలిబన్లకు 20 వేల టన్నుల గోధుమలు పంపి దేశంలోని సామాన్యులను మరిచిన మోదీ దేశభక్తుడా? అని ప్రశ్నించారు. భయపెట్టి ప్రతిపక్ష నాయకులను వశపర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరితే వెంటనే కేసులు మాఫీ చేస్తున్నారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ పోరాటం ఈనాటిది కాదని, దశాబ్దాలుగా సాగుతున్నదని తెలిపారు. కవిత మహిళా రిజర్వేషన్ సమస్యను లేవనెత్తటం వల్లే ఈడీ నోటీసులు పంపిందని చెప్పారు. దేశమంతా రిజర్వేషన్లు కావాలని మహిళలు ఉద్యమిస్తుంటే మోదీకి ఆ పోరాటాలు కనిపించటంలేదని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్‌బిల్లు పాస్ కాకపోవటానికి కాంగ్రెస్, బీజేపీలు తప్పు నాది కాదంటే నాది కాదని తప్పించుకుంటున్నాయని ఆరోపించారు.
దీక్ష శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు సాగింది. దేశంలోని వివిధ జాతీయ, అంతర్జాతీయ మహిళాసంఘాల ప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తరలివచ్చి కవిత దీక్షకు మద్దతు పలికారు. సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించారు. దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించిన వారందరూ ఆ ప్రాంతం దద్దరిల్లేలా ‘సంఘర్ష్ కరో హమ్ ఆప్ కే సాథ్ హై’ అనే నినాదాలతో కవిత పోరాటానికి ఉత్తేజాన్నిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తక్షణమే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్‌బిల్లును ప్రవేశపెట్టాలని శిరోమణి అకాళీదళ్ నేత, మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కుమారుడు నరేశ్ గుజ్రాల్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. స్థానికసంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసినపుడు చట్టసభల్లో ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలను వంటింటికే పరిమితం చేయాలనుకునే బీజేపీ స్వభావాన్ని ఎండగట్టాలని ఆయన
పిలుపునిచ్చారు. తాము కేవలం సంఘీభావం ప్రకటించి ఊరుకోమని, భవిష్యత్‌లో కవిత చేసే పోరాటానికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు
మహిళా రిజ్వరేషన్ బిల్లు తమకు ఎంతో ప్రాధాన్యమైనదని పార్లమెంటులో అడుగు పెట్టినప్పుడు చెప్పిన మోదీ తొమ్మిదేండ్లు గడిచినా ఆ ఊసు ఎత్తడం లేదు.
– లెఫ్ట్ నేతలు సీతారాం ఏచూరి, నారాయణ
మహిళలకు రిజర్వేషన్ కోటా ఇవ్వనంత కాలం రాజ్యాంగానికి రక్షణ ఉండదు.
– శ్యాం రజాక్, ఆర్జేడీ మాజీ మంత్రి
తాలిబన్లకు 20 వేల టన్నుల గోధుమలు పంపుతూ, దేశంలో ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్న మోదీ దేశభక్తుడా?
– సంజయ్ సింగ్, ఆప్ ఎంపీ
మహిళా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకపోవడం శోచనీయం. ఇచ్చిన మాట ప్రకారం మహిళా బిల్లును ప్రవేశపెట్టాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. పార్లమెంటులో మెజారిటీ ఉంటే మహిళా బిల్లును ఆమోదింపచేస్తామని 2014 ఎన్నికల సమయంలో మొదటిసారి, 2019లో మరోసారి బీజేపీ తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. పార్లమెంటు ఉభయ సభల్లో మెజారిటీ ఉన్నా బిల్లు ఆమోదించేందుకు కాలయాపన చేస్తున్నది. ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.
– సుభాషిణీ అలీ, సీపీఐ (ఎం)
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన మాటను ప్రధాని మోదీ నిలబెట్టుకోవాలి. అన్ని రంగాల్లో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తున్న రాజకీయ పార్టీలు పార్లమెంటులో ఎందుకు ఆమోదం తెలుపడంలేదో అర్థకావడం లేదు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపాలి.
– సీమా మాలిక్, ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధి
బీజేపీ తన మ్యానిఫెస్టోలో మహిళా బిల్లు తెస్తామని హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ ఆగస్టు 15న ఎర్రకోట నుంచి నారీ శక్తి గురించి గొప్పగా మాట్లాడుతారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రం లోక్‌సభలో ప్రవేశపెట్టరు. ఎమ్మెల్సీ కవిత పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
– పూజా శుక్లా, సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి