హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఆరుగ్యారెంటీలను అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని అబిడ్స్ జీపీవో వద్ద ఆరు గ్యారంటీలు అమలు చేయాలని పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీ ఏమైందని ప్రశ్నించారు. రూ.2వేల వృద్ధాప్య పింఛన్ రూ.4వేలు చేస్తామన్నారని, వికలాంగుల పింఛన్ రూ.6వేలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా హామీలు అమలు కావడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆరుగ్యారంటీల పత్రంపై సోనియాగాంధీ సంతకంతో ఇంటింటికీ లేఖలు పంచారని.. నిజమేనని నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఇప్పుడు సోనియా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలను అమలు చేసేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలని కోరుతూ సోనియాగాంధీకి పోస్టు కార్డులు రాయాలని నిర్ణయించినట్టు వివరించారు.