హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : ఎర్రబుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి తెలంగాణలో మానవ హక్కులను మంటగలుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనిపించలేదా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి దమనకాండను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే మౌనంగా ఎందుకు ఉన్నారని, ఇది దేనికి సంకేతమని నిలదీశారు. రాహుల్ దారితప్పి తెలంగాణకు వచ్చారని, ‘ఎన్నికల గాంధీకి స్వాగతం’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ఆహ్వానం పలికారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను పరామర్శించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు తన 16 నెలల పాలనలో ప్రజలను రాచి రంపాన పెట్టిందని మండిపడ్డారు. హైడ్రా, మూసి పేరుతో ప్రజలపైకి బుల్డోజర్లు పంపిందని నిప్పులు చెరిగారు. లగచర్ల బంజరా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టిందని ధ్వజమెత్తారు. బంజారా యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షసకాండను జాతీయ మానవహక్కుల కమిషన్ నిర్ధారించిన విషయాన్ని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు. కరెంటు పోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేసి, వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పచ్చని అడవిని సర్వనాశనం చేస్తుంటే నిరసనకు దిగిన హెచ్‌సీయూ విద్యార్థులపై పోలీసులు లాఠీల మోత మోగించి, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేశారని కవిత నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలు సోనియా, ప్రియాంక, రాహుల్‌గాంధీని నమ్మి కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఉమ్మడి రాష్ర్టానికి మించి నిర్బంధాన్ని, అణచివేతను తిరిగి బహుమతిగా ఇచ్చారని ధ్వజమెత్తారు. బీహార్‌లో గ్రూప్-1 బాధితుల గోడు వినాలని బాధితుల పక్షాన గళమెత్తిన రాహుల్ తెలంగాణలోని గ్రూప్-1 బాధిత అభ్యర్థుల ఆందోళనలపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. రాహుల్, సోనియా ఇచ్చిన ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతు రుణమాఫీని సగానికే పరిమితం చేశారని, రైతుబంధు పథకానికి తూట్లు పొడిచారని విమర్శించారు. కల్యాణలక్ష్మితోపాటు ఇచ్చే తులం బంగారం ఏమైందని, మహిళలకు రూ. 2,500 ఎంతవరకు వచ్చిందని, ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడిస్తారని కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.