నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారన్న ఆరోపణలతో కమలాపురం పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. రూ.15 వేలతో రెండు పూచీకత్తులను కోర్టుకు సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కౌశిక్‌రెడ్డి ఓటర్లను బెదిరించారని, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని నోడల్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. దీంతో ఐపీసీలోని 41ఏ సెక్షన్ కింద కౌశిక్‌రెడ్డికి నోటీసులు జారీచేసిన పోలీసులు పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలాలపై మరోసారి విచారణ చేపట్టనున్న కోర్టు.. తదుపరి విచారణకు హాజరు కావాలని ఫిర్యాదుదారుడితోపాటు సాక్షులకు సమన్లు జారీ చేసింది.