KCR | హైదరాబాద్ : రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్యానల్ అధ్యక్షులు కౌశిక్ హరి కుటుంబ సభ్యులు పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిశారు. సిరిసిల్ల, సిద్దిపేట ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావును కూడా కౌశిక్ హరి కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు, కేటీఆర్ కౌశిక్ హరికి శుభాకాంక్షలు తెలిపారు.
బసంత్ నగర్‌లోని కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరితో పాటు ఆయన ప్యానల్ ఘనవిజయం సాధించింది. మొత్తం 788 ఓట్లు పోలవగా కౌశిక్ హరి ప్యానల్‌కు 418, బయ్యపు మనోహర్ రెడ్డి ప్యానెల్‌కు 351, దేవీ లక్ష్మీనరసయ్య ప్యానల్‌కు 1, నరేష్‌కు 9 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 7 ఓట్లు చెల్లలేదు. కౌశిక్ హరి ప్యానల్ గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. పటాకులు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.