కథలాపూర్, జూలై 22 : ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరద కాలువలోకి నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు 500 మంది రైతులు కథలాపూర్‌కు చేరుకొని.. కోరుట్ల-వేములవాడ రోడ్డుపై బైఠాయించారు. బీమారం మండలం మన్నెగుడెం రైతులు కూడా తరలివచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరద కాలువలోకి నీటిని వదిలి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. వరద కాలువలో నీళ్లుంటాయనే నమ్మకంతో నార్లు వేసుకున్నామని, మడులు సిద్ధం చేసుకునే సమయానికి నీళ్లు లేవని ఆందోళన వ్యక్తంచేశారు.
నాట్లు వేసేందుకు మార్గం లేకుండా పోయిందని, వరద కాలువ ద్వారా నీళ్లిస్తే తాము పంటలు సాగుచేసుకుంటామని వేడుకున్నారు. కోరుట్ల-వేములవాడ రోడ్డులో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా, సంఘటన స్థలానికి కోరుట్ల సీఐ సురేశ్‌బాబు చేరుకొని రైతులతో మాట్లాడారు. .తహసీల్దార్.. కోరుట్ల ఆర్డీవో జివాకర్రెడ్డితో ఫోన్లో రైతులతో మాట్లాడించారు. రెండు రోజుల్లో వరదకాలువ ద్వారా నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రైతు ధర్నాలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు నాగం భూమయ్య వంటావార్పు కోసం భిక్షాటన చేశారు.