హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): గీతకార్మికుల రక్షణ కోసం ఇవ్వాల్సిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నది. ఏడాదిన్నర గడిచినా రెండో విడత పంపిణీపై దృష్టి పెట్టడంలేదు. దీనిపై గీతకార్మికులు, సంఘాల నేతలు తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నారు. తాటిచెట్టుపై నుంచి పడి ఏటా చాలామంది కల్లుగీత కార్మికులు ప్రాణాలను కోల్పోవడాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రమాదాల నివారణ కు, తాటిచెట్లను సులభంగా ఎక్కేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానంతో సేఫ్టీ మోకులను రూపకల్పన చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ.8 కోట్లు కేటాయించింది.
ఐఐటీ హైదరాబాద్ సహకారంతో సేఫ్టీ మోకు లు రూపొందించింది. ఒక్కో మోకుకు దాదాపు రూ.12వేలు ఖర్చయింది. అన్ని పరీక్షలు నిర్వహించి ‘కాటమయ్య రక్షణ కిట్ల పేరిట’ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్‌తో రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 10 వేల కిట్లను గీతకార్మికుల కు పంపిణీ చేసింది. బీఆర్ఎస్ సర్కారు సిద్ధం చేసి ఉంచిన వాటిని… తామే ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకున్నారు. త్వరలోనే రెండో విడత కిట్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో 2లక్షలమంది కల్లుగీత కార్మికు లు ఉన్నా.. ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో కాటమయ్య కిట్ల పంపిణీ అటకెక్కింది. సర్కారు తీరుపై గీతకార్మికులు, గౌడ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.