Gudem Mahipal Reddy | హైదరాబాద్, మార్చి 4 ( నమస్తే తెలంగాణ ) : ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి గోడ దూకిన గూడెంను అటు పార్టీలో, ఇటు సుప్రీంకోర్టు బోనులో దోషిగా నిలబెట్టడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థి కాట శ్రీనివాస్ దూకుడుగా ప్రయత్నిస్తున్నారు. దీంతో మహిపాల్‌రెడ్డి ఆత్మరక్షణలో పడ్డట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మంగళవారం గాంధీభవన్‌లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించగా.. గూడెం మహిపాల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. జంప్ జిలానీల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తున్నందున ఈ సమావేశానికి హాజరైతే అడ్డంగా దొరికిపోతాననే భయంతో మహిపాల్‌రెడ్డి సమావేశానికి దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఈ అవకాశాన్ని కాట శ్రీనివాస్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. పటాన్చెరులో మహిపాల్‌రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ కార్యకర్తలపై గూడెం కేసులు పెట్టించారని, తమ మధ్య నెలకొన్న సమస్యల పరిషారం కోసం టీపీసీసీ వేసిన విచారణ కమిటీని లెక్కచేయడం లేదని, ఇప్పటి వరకు కమిటీ ముందు హాజరుకాలేదని కాట శ్రీనివాస్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాట ఫిర్యాదును మీనాక్షి నటరాజన్ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. ‘పార్టీకి అండగా నిలబడిన కార్యకర్తలను కాపాడుకోకపోతే ఎట్లా?’ అని పక్కనే ఉన్న మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖను నిలదీసినట్టు తెలిసింది.
కాట శ్రీనివాస్ ఫిర్యాదు పట్ల స్పందించిన మీనాక్షి నటరాజన్.. పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని హామీ ఇచ్చినట్టు సమాచారం. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల వల్ల సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్టు తెలిసింది. సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు ఒకరినొకరు విమర్శించుకోవద్దని హితవు పలికినట్టు సమాచారం.