హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాలు, వసతి గృహాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతలేని భోజనాలతో ఫుడ్ పాయిజన్లు జరుగుతూ వందలాది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
ఏడాది పాలనలో గొప్పగా చేశామంటున్న ప్రభుత్వం.. నిత్యం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు జరుగుతుండటమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సీఎం స్పందించటం లేదని, సమస్య పరిషారానికి కనీసం సమీక్ష కూడా చేయటం లేదని తెలిపారు. విజయోత్సవాలపై ఉన్న శ్రద్ధ, విద్యార్థుల అనారోగ్యంపై సమీక్షించేందుకు లేదా అని నిలదీశారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు సరఫరా చేసే ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.