TDP | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై మరో కుట్రకు తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకున్నది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించినా, ప్రచారానికి సిద్ధంగా ఉన్నామని నేతలు, కార్యకర్తలు చెప్పినా.. చంద్రబాబు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఈ అనూహ్య నిర్ణయం వెనుక కాంగ్రెస్ కుట్ర దాగున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతోనే టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు.
రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం చిన్నాచితకా పార్టీలతోనూ చర్చలు జరుపుతున్నది. అయితే.. పొత్తుల కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు వరుసగా బెడిసికొడుతున్నాయి. షర్మిల హ్యాండ్ ఇవ్వగా, వామపక్షాలతో చర్చలు విఫలం అయ్యాయి. సీపీఎం ఇప్పటికే సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించగా, సీపీఐ సైతం ఇదే బాటలో నడుస్తున్నది. దీంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో పడిపోగా.. రేవంత్‌రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబు ఆశ్రయం కోరాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు మహాకూటమి పేరుతో కలిసి పోటీ చేస్తే ప్రజలు చీదరించుకున్నారు. కాబట్టి ఈసారి రహస్యంగా సహకరించుకునేలా చీకటి ఒప్పందం చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పకున్నదని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోని కార్యకర్తలు కాంగ్రెస్‌కు ఓటేయాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చెప్పినట్టు ఆదివారం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిని అటు కాంగ్రెస్ కానీ, ఇటు టీడీపీ కానీ ఖండించలేదు. దీంతో రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం నిజమేనని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
పోటీకి నిరాకరించినందుకే కాసాని రాజీనామా
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందుకే పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఎనిమిది పేజీల లేఖను చంద్రబాబుకు పంపించారు. కాసాని జ్ఞానేశ్వర్ గత సోమవారం చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పోటీ చేయవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో అభ్యర్థులు సొంత ఖర్చుతో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అయినా ఎందుకు వద్దంటున్నారో చంద్రబాబు చెప్పడం లేదని అన్నారు. లోకేశ్‌కు 20 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని చెప్పారు. ‘లోకేష్ దగ్గరకు వెళ్తే కనీసం మాట్లాడలేదు.
కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయాలని ఓ వర్గం వాదన తెచ్చింది. ఈ మాత్రం దానికి నన్ను పార్టీలోకి ఎందుకు పిలిచారు, ఎందుకు అధ్యక్ష పదవి కట్టబెట్టారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని మొదట్లో టీడీపీ సిద్ధమైంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటన కూడా చేశారు. చంద్రబాబు జైలులో ఉండటంతో ఎన్నికల ఇన్చార్జిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమించారు. ఆయన వచ్చి ఇక్కడి నేతలతో సమావేశం నిర్వహించి, తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఇక అభ్యర్థులను ప్రకటించడమే తరువాయి అనుకున్న దశలో.. రేవంత్‌రెడ్డి చక్రం తిప్పారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎన్ని కుట్రలు చేసైనా గెలవాలన్న ఏకైక లక్ష్యంతోనే కాంగ్రెస్ పనిచేస్తున్నదని, అందుకే ఎన్నడూ లేని విధంగా పొత్తులు, రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నదని అంటున్నారు. గత ఎన్నికల్లో కలిసి పోటీచేసిన తెలంగాణ జన సమితి పోటీ నుంచి తప్పుకోగా ఇప్పుడు టీడీపీని తప్పించారని, వచ్చే ఒకటి రెండు ఓట్లను కూడా తమకే పడేలా చేసుకోవాలనే లక్ష్యంతోనే ఈ కుట్రకు తెరలేపిందని మండిపడుతున్నారు.