
హైదరాబాద్: రాష్ట్రంలోని శివాలయాలు, పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తిక శోభతో (Karthika pournami) ఆలయాలు కళకళలాడుతున్నాయి. కార్తిక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.

కార్తిక పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి.. నదిలో కార్తిక దీపాలు వదులుతున్నారు. నది ఒడ్డున ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు ఆచరిస్తున్నారు.

హనుమకొండలోని వేయిస్తంభాల గుడిలో కార్తిక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు.
నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు ఆలయం కార్తిక శోభను సంతరించుకున్నది. తెల్లవారుజామునే భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గుట్టపైకి వాహనాలను అధికారులు అనుమతించడంలేదు.
అలంపూర్ శైవక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. జోగులాంబ ఆలయం కార్తిక శోభ సంతరించుకున్నది. తెల్లవారుజాము నుంచే తుంగభద్ర నదిలో భక్తులు పుణ్యస్నాలు ఆచరించి కార్తిక దీపాలు వదులుతున్నారు. బాల బ్రహ్మేశ్వరస్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు.