హైదరాబాద్, జూన్ 29 (నమస్తేతెలంగాణ): నల్లగొండలో కాంగ్రెస్ సభ కామెడీ షోను తలపించిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్‌తో కలిసి సోమవారం మాట్లాడారు. ఈ సందర్బంగా కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ నల్లగొండ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేశానని ఒకసారి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి చేస్తానని మరోసారి మతిలేకుండా మాట్లాడారని ఎద్దేవాచేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై దూషణలు తప్ప సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధిపై మాట్లాడింది ఏమీ లేదని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలపై నిలదీస్తారనే భయంతోనే బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, వామపక్షాల నాయకులను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సభ సాక్షిగా నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా సీఎం దారిలోనే అబద్ధాలు వల్లెవేశారని మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో రికార్డుస్థాయిలో ధాన్యం పండిందని సీఎం చెప్పారని, దీనిలో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన చర్యలేంటని నిలదీశారు. కనీసం ఒక్క ప్రాజెక్టునైనా కట్టారా? పిల్ల కాలువైనా తవ్వారా? కొత్తగా ఎకరానికైనా నీరందించారా? అని ప్రశ్నలవర్షం కురిపించారు. కేసీఆర్ కాళేశ్వరం నిర్మించి ఎస్పారెస్పీ ద్వారా కోదాడ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలకు నీరందించడంతోనే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు.
చరిత్ర తెలియదు..పాలన చేతగాదు: బొల్లం మల్లయ్యయాదవ్
రేవంత్‌రెడ్డికి చరిత్ర తెలయదు..పాలన చేతగాదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ దెప్పి పొడిచారు. మూసీకి అడ్డొచ్చిన వారిని తొక్కుతా అని మాట్లాడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. రాహుల్‌కు సంచులిచ్చి..మోడీని మభ్యపెట్టి సీఎం కుర్చీ కాపాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులకు రిబ్బన్ కట్‌చేసేందుకు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారని చురకలంటించారు. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
ఆరుసార్లు వచ్చి.. ఇచ్చింది సున్నా: చిరుమర్తి లింగయ్య
నల్లగొండకు ఆరుసార్లు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన నిధులు గుండు సున్నా అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఎద్దేవాచేశారు. తొక్కుతా.. తొక్కుతా అని మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డిని తొక్కే సమయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు. నల్లగొండ అభివృద్ధి ఖ్యాతి కేసీఆర్‌దేనని స్పష్టంచేశారు. ఏకంగా రూ. 1500 కోట్లు ఇచ్చారని, యాదాద్రి ఆలయాన్ని కట్టారని, వెలుగులు పంచే వైటీపీఎస్ను నిర్మించారని గుర్తుచేశారు. కానీ రెండున్నరేండ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేంటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతల పంచాయితీ సభ: బాలరాజు యాదవ్
నల్లగొండలో కాంగ్రెస్ సభ ఆ పార్టీ నేతల పంచాయితీ సభగా మారిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఎద్దేవా చేశారు. నల్లగొండలో మూడు కుటుంబాల నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలుగా ఉన్నారనే సోయి లేకుండా కేసీఆర్ కుటుంబ పాలన గురించి మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బ్యాగులు మోసి పట్టుబడ్డ రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌ను విమర్శించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు.