జెనీవా, ఆగస్టు 16: ధ్వనిని ఉపయోగించి చిన్న డ్రోన్లకు శక్తి (పవర్)ని అందించే కొత్త మార్గాన్ని స్విట్జర్లాండ్ పరిశోధకులు కనుగొన్నారు. స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ లోసాన్ (ఈపీఎఫ్ఎల్)కు చెందిన శాస్త్రవేత్తలు శబ ్దతరంగాలను ఉపయోగించి గాలిలో నీటిపై కదలగల చిన్న డ్రోన్లను అభివృద్ధి చేసినట్టు స్విస్ ఇన్ఫో వెల్లడించింది. చిన్న వాహనాలకు కావిటీస్ అని పిలిచే ప్రత్యేకమైన బోలు నిర్మాణాలను ఇవ్వడం ద్వారా పరిశోధకులు దీనిని సాధించారు. ఈ కావిటీలు ధ్వనిని చోదక శక్తిగా మార్చగలవు. అయితే ఈ చోదక శక్తి పరిమాణం ధ్వని ఫ్రీక్వెన్సీపై ఆధారపడి ఉంటుంది.
ద మైక్రో రోబోటిక్ సిస్టమ్స్ లేబరేటరీ వారు గుండ్రటి, బెల్లు ఆకారంలోని కేవిటీలను సృష్టించారు. పరికరాలకు బోలు కావిటీలు ఇవ్వడం వల్ల మోటర్లు, గేర్లు, అయస్కాంత పదార్థాలు లేకుండానే పరికరాలను నడిపించవచ్చు. పైగా అవి చాలా తేలికగా, చిన్నవిగా ఉంటాయి. భవిష్యత్తులో ధ్వని-సున్నితమైన నిర్మాణాలను వంగే స్వభావం గల పరికరంలో అమర్చవచ్చునని పరిశోధకులు పేర్కొన్నారు. శబ్దాన్ని విన్నప్పుడు తమ ఆకారాన్ని మార్చుకోగల ఏరో డైనమిక్ రోబోల తయారీకి ఇది దారి తీయవచ్చునని ఈపీఎఫ్ల్ లేబరేటరీ డైరెక్టర్ సెల్మాన్ సకర్ పేర్కొన్నారు. శబ్ద తరంగాలను ఉపయోగించి వస్తువులను గాలితో తేలేలా చేయడానికి కూడా ఈ విధానాన్ని ఉపయోగించినట్టు ఆయన తెలిపారు.