కృష్ణ, జూలై 12 : సెల్ఫీ దిగుదామని చెప్పి ఓ భార్య భర్తను నదిలోకి తోసేసిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని కృష్ణాబ్రిడ్జి వద్ద శనివారం చోటుచేసుకున్నది. స్థానికులు గుర్తించి అతడిని కాపాడారు. వివరాలు ఇలా.. కర్ణాటక రాష్ట్రంలోని మీరాపూర్కు చెందిన తాతప్ప భార్యతో కలిసి బైక్పై ఒడిగేర్ గ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో తెలంగాణ సరిహద్దులోని కృష్ణా మండలం గుర్జాపూర్ వద్ద కృష్ణా బ్రిడ్జిపై సెల్ఫీ దిగుదామని భార్య కోరడంతో బైక్ ఆపాడు. ఇద్దరు కలిసి బ్రిడ్జిపై సెల్ఫీ దిగుతున్న క్రమంలో భర్త తాతప్పను భార్య నదిలోకి తోసేసింది. నదిలో కొట్టుకుపోతున్న తాతప్పను స్థానికులు గుర్తించారు. నది మధ్యలోని జితామిత్ర స్వామి వారి గడ్డలో ఉన్న వ్యక్తులు కొంతమంది పొడగాటి తాళ్లు నదిలోకి విసిరి తాతప్పను కాపాడారు. భర్తను నదిలోకి తోసేసిన భార్య మాత్రం.. అక్కడే ఉండి తన భర్త ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని చెప్తుండటం గమనార్హం. నది నుంచి బయటపడిన తాతప్ప తనను కావాలనే నదిలోకి తోశావని భార్యతో గొడవపడి ఆమెను అక్కడే వదిలి బైక్పై వెళ్లిపోయాడు. అనంతరం ఆమె కూడా వేరే వాహనం ఎక్కి వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు.