Karnataka Farmers Protest | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో గడిగడికీ కరెంటు సమస్య వస్తున్నదని ఆ రాష్ట్ర రైతులు చెప్తున్నారు. తమ సమస్యలు తీర్చుతారని కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తే నిండా మోసపోయామని అంటున్నారు. నెల కింది వరకు 3 గంటల కరెంటే ఇచ్చి, తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని అక్కడ 5 గంటలు చేసిందని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక పార్టీలకు ఓటు వేయొద్దు.. రైతు పక్షాన ఉండే పార్టీలకే ఓటు వేయాలంటూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద కర్ణాటక రైతు సంఘం ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర రైతులు సంఘీభావ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ కాంగ్రెస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇన్నేళ్లు ఆ రెండు పార్టీలతో రైతు సమాజం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు సంపన్నులు, కార్పొరేట్ శక్తులు పెద్దమొత్తంలో భూములు కొనుగోలు చేసే అవకాశం కల్పించటంతో వేల మంది రైతులు వ్యవసాయానికి దూరమైతున్నారని తెలిపారు. పంప్సెట్ల కోసం ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, వైర్లు, ఇతర పనిముట్లను కూడా రైతులే కొనుక్కోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదని నిట్టూర్చారు. కర్ణాటకలో కొబ్బరి, పాడి, చెరుకు రైతులకు కనీస మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సాగును భారంగా మార్చేలా తమ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రైతులను దోచుకొనే విధానాలు అవలంబిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటక రైతుల ధర్నాతో కాంగ్రెస్‌లో గుబులు
హైదరాబాద్ వేదికగా కర్ణాటక రైతులు చేపట్టిన ధర్నా కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టించింది. దీనిని అడ్డుకునేందుకు గేటర్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడమే ఇందుకు నిదర్శనం. ఇందిరా పార్కుకు చేరుకున్న రైతు సంఘాల నేతలను ‘మీకు ఇక్కడేం పని? ఇక్కడ ధర్నా చేయాల్సిన అవసరం ఏమిటి?’ అని ప్రశ్నిస్తూ సమావేశాన్ని అడ్డుకోవాలని చూశారు. అయితే కర్ణాటక రైతుల సమాధానంతో కాంగ్రెస్ నేతలకు తల తిరిగింది. ‘రైతు వ్యతిరేక విధానాలను అవలంబించే కాంగ్రెస్‌పై ఏ రాష్ట్రంలోనైనా సమావేశాలు పెడతాం. ఢిల్లీలోనూ సభలు నిర్వహించాం. ఎన్నికలు జరిగే అన్ని రాష్ర్టాల్లో పర్యటన చేస్తాం’ అని అనటంతో కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు. కర్ణాటక రైతులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అండగా నిలిచే పార్టీలకే రైతుల ఓట్లు
దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ రైతుల కోసం ఏ ఒక్క ప్రయోజనకరమైన విధానాలను రూపొందించలేదు. అధికారం కోసం కొన్ని పార్టీలు చేస్తున్న మోసపూరిత ప్రకటనలను గ్రహించి, సాగునీరు, నాణ్యమైన కరెంట్, మద్ధతు ధర, పంట నష్టపరిహారం ఇస్తూ భరోసానిచ్చే పార్టీలకే రైతులు అండగా నిలవాలి.
– కమల్ పటేల్, కర్ణాటక రైతు
కాంగ్రెస్‌తో రైతుల బతుకులు నిర్వీర్యం
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు బతుకులు నిర్వీర్యమవుతున్నాయి. రాష్ట్రంలో మార్కెట్ కమిటీలను రద్దు చేసింది. రైతులు పండించిన పంటను కార్పొరేట్ సంస్థల చేతిలోకి వెళ్లేలా వ్యవహరిస్తున్నది. ఇదే జరిగితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ, ఆహార ఉత్పత్తులను శాసించే పరిస్థితి వస్తుంది.
– ఉమ, రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్
మూడు గంటల కరెంటే
కర్ణాటకలో రైతులకు అవసరమైన కరెంట్ సరఫరా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్రస్తుతం మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వటం లేదు. వరి, కంది, మిరపకు కనీస మద్దతు ధర రావటం లేదు. దీంతో చేతికి వచ్చిన పంటను నష్టానికే అమ్ముకోవాల్సి వస్తున్నది.
– దుర్గాప్రసాద్, రాయచూర్