చుట్టపు చూపుగా ఎన్నికల ప్రచారానికి వచ్చి వెళ్తున్న కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకులు పెడుతున్న పెంట అంతా, ఇంతా కాదని ఇరు పార్టీల లోకల్ నేతలు మండిపడుతున్నారు. వాళ్లు మీడియాతో ఏం మాట్లాడాలనుకున్నారో ఆ విషయం ముందు వీళ్లతో చర్చిస్తే తప్పులను సరి చేసే అవకాశం ఉండేదేమో. కానీ అలా చేయకుండా సోషల్ మీడియాలో వచ్చిందే నిజం అనుకొని అడ్డగోలుగా ప్రసంగించి ఫ్లైట్ ఎక్కి చెక్కేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ల వ్యాఖ్యలను సమర్థించలేక, ఖండించలేక.. పీక్కోలేక, లాక్కోలేక చస్తున్నామని తెగ బాధపడిపోతున్నారు.
ఇటీవల కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ‘వ్యవసాయానికి మేము ఐదు గంటల కరెంటే ఇస్తున్నాం’ అన్నారు. ఇక్కడేమో 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. అలా ఆయన చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పరువుపోయింది. అసలు కరెంట్ విషయం ఎత్తకండని బయటి నుంచి వచ్చే నాయకులకు చెబుతూనే ఉన్నా, వినిపించుకోకుండా ఏదేదో వాగి తమను ఇరకాటంలో పడేస్తున్నారని గాంధీ భవన్ నాయకులు కుమిలిపోతున్నారు.
మరో సీనియర్ నాయకుడు చిదంబరం, ఏకంగా… తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరే కారణమని అచ్చం బీఆర్ఎస్ నాయకుడిలాగే మాట్లాడారు. పైగా అప్పుడు జరిగిన దానికి సారీ కూడా చెప్పడంతో వాళ్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. ఇది ఇలా ఉంటే బీజేపీ నేత అమిత్ షా తన గద్వాల పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 40 వేల కోట్ల అవినీతి జరిగిందని వ్యాఖ్యానించారు.
అందులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఇప్పటి దాకా డప్పు వాయించారు కమలం పార్టీ నేతలు. ఆయనేమో ఉన్నట్టుండి రూ. 60 వేల కోట్లు తగ్గించేయడంతో ఏం చేయాలో ఇక్కడి వాళ్లకు పాలుపోవడం లేదు. వచ్చిన వాళ్లు నోటికొచ్చినట్టు ప్రసంగించి వెళ్లాక వీళ్ల పరిస్థితి దబిడి…దిబిడే… అన్నట్టు ఉంటున్నదట పాపం. ఒక పక్క సీఎం కేసీఆర్, ఇంకో పక్క కేటీఆర్, మరో పక్క హరీశ్‌రావు, అటు పక్క కవిత… తమపై సంధించే మాటల, తూటాలకు సమాధానం చెప్పలేక జుట్టుపీక్కోవాల్సి వస్తున్నది పువ్వు గుర్తు లీడర్లూ, హస్తం పార్టీ నేతలూ వాపోతున్నారు!
– వెల్జాల