Congress | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. ఇప్పటికే ఫేక్ సర్వేలతో మైండ్‌గేమ్ ఆడుతున్న పార్టీ ఫేక్ రాజకీయంలో మరో ముందడుగు వేసింది. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా.. అబద్ధాలు, అభూత కల్పనలతో మా యామశ్చీంద్ర విద్యలను ప్రదర్శిస్తున్నది. ఓట్ల వేటలో విన్యాసాలు చేయబోయి పప్పులో కాలేసింది. లేనివి ఉన్నట్టుగా ప్రచారం చేసుకొనే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి అభాసుపాలయ్యింది. ‘ఆరు నెలల అద్భుత సాధన’ పేరుతో కర్ణాటక కాంగ్రెస్ సర్కారు తెలంగాణలోని తెలుగు పత్రికలకు శుక్రవారం భారీ ప్రకటనలు ఇచ్చింది. తాము 6 గ్యారెంటీలను నెరవేర్చామని చెప్పడం ఈ యాడ్ థీమ్. ఈ ప్రకటనలో ఓ విద్యార్థి ఫొటోను వాడారు.
ఆ విద్యార్థి యువనిధి కింద తనకు నెలకు రూ.3వేలు అందుతున్నదని చెప్పినట్టుగా ప్రకటన జారీచేశారు. వాస్తవానికి ఆ విద్యార్థి ఫొటో ఒక వెబ్‌సైట్‌కు చెందినదిగా తేలింది. కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్న యువకుడి చిత్రాన్ని పరిశీలిస్తే ఇది ప్రాక్టీస్ విత్ ఈవ్ (PRACTICE WITH EVE) వెబ్సైట్ నుంచి తీసుకున్నట్టు గుట్టురట్టయ్యింది. మేనేజ్మెంట్ విద్యార్థులకు కేస్ సాల్వింగ్ సామర్థ్యాన్ని పెంచే ఆన్లైన్ వేదిక ఇది. భవిష్యత్తులో ఇంటర్వ్యూలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. వారానికి రెం డు కేసులు ఇచ్చి విద్యార్థులతో ప్రాక్టీస్ చేయిస్తారు. ఇలాంటి పోర్టల్ నుంచి ఊరు, పేరులేని ఫొటోను తీసుకుని ఆ విద్యార్థికి సీకే మహేశ్ అని కాంగ్రెస్ పేరు తగిలించింది. గ్రాడ్యుయేట్ విద్యార్థిగా పేర్కొని తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఈ విషయం తెలుసుకొన్న నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని ఓ ఆట ఆడుకున్నారు. ఓట్ల కోసం ఇంత ఫేక్ ప్రచారం చేస్తారా? అని హస్తం పార్టీ ఇజ్జత్ తీసి ఆన్లైన్లో పెట్టారు.
తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఫేక్ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కర్ణాటక ప్రజల సొమ్మును వాడటం గమనార్హం. కర్ణాటక ప్రభుత్వానికి, తెలంగాణ ఎన్నికలకు అసలు ఎలాంటి సంబంధం లేదు. కానీ అక్కడి కాంగ్రెస్.. అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు.. వారి కన్నీళ్లను తుడిచేందుకు ఖ ర్చు చేయాల్సిన ప్రజాధనాన్ని తెలంగాణ ఎ న్నికల్లో ప్రచారానికి వాడుతున్నది. ప్రస్తుతం కన్నడనాట తీవ్ర విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. తాము నెరవేర్చుతామని చెప్పిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పూర్తిగా అమలు చేయడం లేదు. కానీ కర్ణాటక ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బును తెలంగాణలో పార్టీ ప్రచారానికి విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. దీనిపై అటు కర్ణాటకవాసులతోపాటు ఇటు తెలంగాణ ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో గెలిచేందుకు కర్ణాటక ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. రేపు ఇక్కడ గెలిస్తే దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ప్రచారానికి మన సంపదను దోచుకెళ్లదా? అని ప్రశ్నిస్తున్నారు. ఫేక్ కాంగ్రెస్‌ను నమ్మేది లేదని తేల్చిచెప్తున్నారు.