జహీరాబాద్, అక్టోబర్ 7: కొద్దిక్షణాల్లో ఇంటికి చేరుకుంటామనుకునేలోగా ఎదురుగా మృత్యురూపంలో వచ్చిన కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్‌పూర్‌లో చోటుచేసుకుంది. గణేశ్‌పూర్‌కు చెందిన గునెల్లి సిద్రామప్ప (71), ఆయన అల్లుడు జగన్నాథ్ (42), కూతురు రేణుక(38), మనుమడు వినయ్‌కుమార్(15) పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ.. బైక్‌పై రోడ్డు దాటుతుండగా జహీరాబాద్ నుంచి బీదర్‌కు వెళ్తున్న కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిద్రామప్ప అక్కడిక్కడే మృతి చెందాడు. జగన్నాథ్, అతడి భార్య రేణుక, కుమారుడు వినయ్‌కుమార్‌లను చికిత్స కోసం కారులో బీదర్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. జహీరాబాద్ డీఎస్పీ రాంమోహ్మన్రెడ్డి, రూరల్ సీఐ హనుమంతు, హద్నూర్ ఎస్సై రామానాయుడు ఘటనా స్థలా న్ని సందర్శించారు. మృతుడు సిద్రామప్పకు ఇద్దరు భార్యలు. ఆయన అల్లుడు జగన్నాథ్‌కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్టు గ్రామస్థులు పేర్కొన్నారు.