హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలోని రాయచూర్ జిల్లాను తెలంగాణలో విలీనంచేయాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం రాయచూర్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్తర కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్, బెంగళూరును పట్టించుకొంటున్నారని, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో గుల్బర్గా, బీదర్‌ను మాత్రమే చూస్తున్నారని.. తమ రాయచూర్ బాగోగులు, సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతులు, ఇతర అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలుచేస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలోని సంక్షేమ పథకాలను తమ గ్రామాల్లోనూ అమలుచేయాలని.. అలా చేయలేకపోతే.. తెలంగాణలో కలిపేయాలని డిమాండ్‌చేశారు. గతంలోనూ మహారాష్ట్రలోని కిన్వట్, మాహోర్ తాలూకాలోని పలు గ్రామాల రైతులు నాందేడ్ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సైతం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు కర్ణాటక ఎమ్మెల్యే శివరాజ్ రాయచూర్‌ను తెలంగాణలో కలపాలంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
దీనిపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. ‘తెలంగాణ ఖ్యాతి సరిహద్దులు దాటింది.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాయచూర్‌ను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు. అక్కడున్న ప్రజలంతా ఆయన సూచనను చప్పట్లతో స్వాగతించారు’ అంటూ ట్వీట్‌చేశారు. దీనిపై వందల సంఖ్యలో నెటిజన్లు ‘తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.. కేసీఆర్ లాంటి సీఎం మరొకరు ఉండరు.. కేసీఆర్ పాలనకు ఫిదా అయిన బీజేపీ ఎమ్మెల్యే.. కేసీఆరా మజాకా’ అంటూ ట్వీట్ల ద్వారా స్పందించారు.
Validation for Telangana coming from across the border; Karnataka BJP MLA says Raichur should be merged in Telangana & the audience welcomes the suggestion with applause 👏 https://t.co/wdPUP3tfGs
— KTR (@KTRTRS) October 11, 2021