కేటీదొడ్డి, ఏప్రిల్ 4: తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామ సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో నిర్వహించేందుకు అనుమతులు తీసుకోకుండా కన్నడ నాయకులు ప్రచార సభకు సన్నాహాలు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు.
వివిధ గ్రామాల నుంచి ప్రజలను తరలించడానికి సన్నద్ధం కాగా.. ఎస్సై వెంకటేశ్ సభా స్థలానికి చేరుకొని సమావేశం నిర్వహించకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకొన్న కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా బీజేపీ ముఖ్య నేత రాకుండానే వెనుదిరిగారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న గ్రామాల నాయకులు మాత్రం.. ఇర్కిచేడ్ సమీపంలో ఉన్న అమ్మవారిని తాము పూజిస్తామని, అందుకే దావత్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టు తెలంగాణ పోలీసులకు తెలిపారు. దీంతో ఎస్సై వెంకటేశ్ అనుమతి ఇవ్వడంతో భోజనం చేసి తిరిగి వెళ్లిపోయారు.