కరీంనగర్ కార్పొరేషన్, జూలై 28 : తెలంగాణలోని బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా బీజేపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తే తీవ్ర పరిణమాలు ఉంటాయని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. సోమవారం కరీంనగర్ రేకుర్తిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చేపట్టిన పనులను ఆయన పరిశీలించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఒకరేమో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, మరొకరేమో ముస్లింలను కలిపినందుకే అడ్డుకుంటున్నామని తెలంగాణలోని బీసీల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో తమిళనాడు సీఎం జయలలిత ఢిల్లీ వెళ్లి రిజర్వేషన్ అంశం తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించారని గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీలందరినీ రాజకీయాలకు అతీతంగా ఢిల్లీకి తీసుకెళ్లి తిష్ఠ వేయాలని సూచించారు. దీనికి తామంతా అండగా ఉంటామని చెప్పారు. మొక్కుబడిగా గవర్నర్‌కు పంపిస్తే వచ్చేది కాదని తెలిపారు. బీసీల కోసం పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీమాంధ్ర నాయకులెవ్వరూ నోరు మెదపలేదని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు, మోదీ తెలంగాణపై విషం చిమ్మే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపేయాలన్న కుట్రలో భాగంగా ఎంపీ సీఎం రమేశ్ వాఖ్యలు చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కాపాడుకోవటానికి బీఆర్ఎస్ ఉందని, ఏ పార్టీలో విలీనంచేసే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు.