హైదరాబాద్, మే 6 (నమస్తేతెలంగాణ): ‘కరీంనగర్లో జ్యూవెల్లరీ షాప్ దోపిడీ, శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతిపక్ష నేతగా కేటీఆర్ ఉన్న మాటంటే బండి సంజయ్‌కి ఉలుకెందుకు ? శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన రేవంత్‌రెడ్డిని అంటే నువ్వెందుకు ఎగిరెగిరి పడుతున్నవ్..? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించాలని, సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీయాలని అడగడమే కేటీఆర్ చేసిన తప్పా..?’ అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రిననే విషయం మరిచిపోయి ఫ్రస్ట్రేషన్లో సోయి తప్పి కేటీఆర్‌ను దుర్భాషలాడటం సిగ్గుచేటని ఖండించారు. తెలంగాణభవన్‌లో బుధవారం బీఆర్ఎస్ నేతలు రవీందర్‌రెడ్డి, తిరుపతినాయక్తో కలిసి గంగుల విలేకరులతో మాట్లాడారు.
ఉన్నత హోదాలో ఉన్న బండి సంజయ్ బీజేపీ కార్యకర్త కంటే దిగజారి మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రం చేపట్టాల్సిన కొత్తపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, డంప్యార్డ్లపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. రెండున్నరేండ్ల నుంచి అభివృద్ధి పనులకు నయాపైసా ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై ఇష్టమొచ్చినట్టు అవాకులు చవాకులు పేలడం సరికాదని గంగుల పేర్కొన్నారు. కరీంనగర్ వస్తే అడ్డుకుంటామనడం శోచనీయమన్నారు. ‘బండి సంజయ్.. కరీంనగర్ ఏమైనా నీ జాగీరా? బరాబర్ వస్తాం.. ప్రజాసమస్యలపై తప్పకుండా ప్రశ్నిస్తాం’ అని తేల్చిచెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ తోడుదొంగలని విరుచుకుపడ్డారు. బండికి ఒక సోదరుడిలా సలహా ఇస్తున్నానని, ఇప్పటికైనా బజార్ భాష బంద్‌పెట్టి హుందాగా నడుచుకోవాలని సూచించారు.
సర్కార్‌లో వణుకు: కేపీ వివేకానంద
కేటీఆర్ రైతు సభ సక్సెస్ కావడంతో రేవంత్ సర్కార్‌కు వణుకు పుట్టిందని బీఆర్ఎస్ఎల్పీ విప్ కేపీ వివేకానంద్‌గౌడ్ అన్నారు. వరంగల్‌లో కేటీఆర్ స్పీచ్ ముగిసిన వెంటనే ఢిల్లీ నుంచి రేవంత్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిఫ్ట్ చదువుతూ ఆయన అనుచరులు, చెంచాగాల్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసిందని ధ్వజమెత్తారు. దమ్ముంటే రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌పై చర్చకు రావాలని డిమాండ్ చేశారు.