కరీంనగర్ : రాష్ట్రంలో హైదరాబాద్ నగరం తరువాత కరీంనగర్‌ను సుందరంగా , గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్(Karimnagar)లో రూ. కోటి 20లక్షల తో అభివృద్ధి చేసిన తెలంగాణ చౌక్ కూడలి ట్రయల్ రన్ ను నగర మేయర్(Mayor) యాదగిరి సునీల్ రావు తో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగరాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలన్నదే తమ ధ్యేయమన్నారు. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. మూడు నెలల్లో కూడళ్ల నిర్మాణం పూర్తి చేసి 13 జంక్షన్ లను సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అందుబాటులో ఉన్న స్థలంలోనే కూడళ్లను ఆధునిక డిజైన్లు, గ్రీనరీ, వాటర్, లైటింగ్ సిస్టంతో తీర్చి దిద్దుతున్నామని తెలిపారు.
కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్(CM KCR) లేవు అనకుండా వేలాదికోట్ల రూపాయలను విడుదల చేస్తున్నారని తెలిపారు. కేబుల్ బ్రిడ్జి (Cable Bridge)ప్రారంభం లోగానే కూడళ్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు.నగర ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా భద్రతావలయాన్ని పటిష్ట పరుస్తామని, ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీకెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తామని అన్నారు. మంత్రి వెంట బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, జంగిలి సాగర్, దిండిగాల మహేష్, గుగ్గిళ్ళ శ్రీనివాస్ , నాయకులు పాల్గొన్నారు.