కరీంనగర్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆయన సొంత ఇలాకాలోనే తిరుగుబాటు మొదలైంది. ధర్మం కోసం పారాటం చేస్తున్నామని కార్యకర్తలను రెచ్చగొట్టి, ధనం పోగేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆ పార్టీ కిందిస్థాయి నేతలు బండిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తన కుటుంబం బాగు తప్ప పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సమస్యలను ఆయన ఏనాడూ పట్టించుకోలేదని మండిపడుతున్నారు. పార్టీలో దళితులు, వెనుకబడిన వర్గాలకు కనీస గౌరవం దక్కటంలేదని ఆవేదక వ్యక్తంచేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లు మెండి శ్రీలత చంద్రశేఖర్, నక్క పద్మ కృష్ణ ఇటీవల టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. బండి సంజయ్ తీరుతో విసుగుచెందే తాము టీఆర్ఎస్లో చేరామని వారు తెలిపారు. మరికొంత మంది బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు కూడా టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు.
బండి సంజయ్ మమ్మల్ని ఏనాడూ పట్టించుకోలేదు. నాయకులు, కార్యకర్తలు గిట్లనే ఉండాలి. నేను, నా కుటుంబం మాత్రం సేఫ్‌గా ఉంటే చాలన్నట్టు వ్యవహరిస్తారు. కార్యకర్తలను, యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం తప్ప మరోటి లేదు. కార్యకర్తలు ధర్మం కోసం పని చేస్తే ఆయన మాత్రం ధనం కోసం, పేరు కోసం పని చేస్తున్నారు. ఏమైనా అంటే ఇప్పటికే ఏడుసార్లు జైలుకు పోయా. మీరు కూడా జైలుకు వెళ్తే పేరు వస్తుందని రెచ్చగొడుతాడు. ఎంపీగా గెలిచిన తర్వాత కరీంనగర్ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదు. ఒక్క రోజు కూడా నగరపాలక సంస్థకు వచ్చి సమస్యలు తెలుసుకోలేదు. మంత్రి గంగుల కమలాకర్ మాత్రం ప్రతినెలా కార్పొరేషన్‌కు వెళ్లి అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించి పనులు చేపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు. మీ నాయకుడు ఎక్కడ? కేవలం పేపర్లో, సోషల్ మీడియాలోనే కనిపిస్తాడా? అభివృద్ధి గురించి ఏం చేయ్యరా? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీలో దళితులకు ప్రాధాన్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు తీసుకువచ్చి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. బీజేపీలో అనేక వర్గాలున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేందరా? బండి సంజయా? అన్నది తెలియటం లేదు. కరీంనగర్లో ఇతర నాయకులను ఎదగకుండా చేస్తున్నాడు. నగర పార్టీ అధ్యక్షుడిని ఒక్కరినే నియమిస్తే ఎక్కడ తనకు పోటీ వస్తారోనన్న భయంతో నగరాన్ని ఐదు జోన్లుగా విభజించి ఐదుగురు అధ్యక్షులను పెట్టారు.
– మెండి శ్రీలత చంద్రశేఖర్, కరీంనగర్ 44వ డివిజన్ కార్పొరేటర్
రాష్ట్రంలో సాగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి మేము టీఆర్ఎస్లో చేరాం. బీజేపీలో కార్పొరేటర్‌గా గెలిచినా ఏనాడూ మాకు గౌరవం దక్కలేదు. పార్టీ అధ్యక్షుడు మమ్మల్ని పట్టించుకోలేదు. డివిజన్లోని సమస్యల పరిష్కారానికి ఎలాంటి సహకారం అందించలేదు. అభివృద్ధి చేస్తున్న పార్టీల్లో ఉండకుండా మరోదానిలో ఉండి ఏం చేస్తావని డివిజన్లోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నగరంలో వందల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో రోజు మంచినీరు అందించటంతోపాటు, సీసీ రోడ్ల నిర్మాణాలకు భారీగా నిధులు కేటాయించారు. మా డివిజన్ల సమస్యలపై ఎప్పుడు మేయర్‌కు విన్నవించినా వివక్ష చూపకుండా వెంటనే పరిష్కరిస్తున్నారు. అలాంటప్పుడు టీఆర్ఎస్లోనే ఉంటే మరింత అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించవచ్చన్న ఆలోచనతోనే పార్టీలో చేరాం.
– నక్క పద్మ కృష్ణ, కరీంనగర్ 26వ డివిజన్ కార్పొరేటర్