బీఆర్ఎస్ హయాంలో 3 కోట్ల మందికి పైగా లబ్ధి గ్రామీణ ప్రజలు కండ్ల విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటారు. వారికి రోజూవారీ ఇబ్బందులు ఉంటాయి. గతంలో కంటి వెలుగు క్యాంపులతోపాటు కంటి అద్దాలు ఉచితంగా ఇచ్చారు. అందుబాటులో లేనివారి ఇంటికే అద్దాలు పంపించారు. భేషజాలకు పోకుండా ఈ స్కీమ్ అమలుపై ఆలోచన చేయాలి.-శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పాలనలో అమలుచేసిన ‘కంటి వెలుగు’ మంచి కార్యక్రమమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశంసించారు. శనివారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ‘కంటివెలుగు’పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి మాట్లాడుతూ.. ఆర్థికభారం లేని ఈ స్కీమ్‌ను ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పందిస్తూ.. గ్రామీణ ప్రజలు కండ్ల విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటారని, అయితే వారికి రోజూవారీ ఇబ్బందులు ఉంటాయని పేర్కొన్నారు. గతంలో కంటి వెలుగు క్యాంపులతోపాటు కంటి అద్దాలు ఉచితంగా ఇచ్చారని, అందుబాటులో లేనివారి ఇంటికే అద్దాలు పంపించిన విషయాన్ని గుర్తుచేశారు. క్యాంపుల్లో కంటి ఆపరేషన్ చేస్తే ఇన్ఫెక్షన్లు వస్తాయనే భయంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శస్త్రచికిత్సలు చేయలేదని పేర్కొన్నారు. భేషజాలకు పోకుండా ఈ స్కీమ్ అమలుపై ఆలోచన చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.