హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలో నల్లగొండకు చెందిన ఓ కార్యకర్త.. కేసీఆర్‌పై అభిమానంతో వ్యాన్ ఎక్కి ఫ్లకార్డు పట్టుకున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని, కొట్టారు. కేసీఆర్ విచారణ ముగించుకొని తిరిగి వెళ్లిపోయాక ఆ కార్యకర్తను వాహనంలోకి ఎక్కించి, స్టేషన్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కార్యకర్తలతో కలిసి పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
పోలీసులు వినకుండా కార్యకర్తను తమ వాహనంలోకి ఎక్కిస్తుంటే.. అడ్డుకోబోయారు. దీంతో దివ్యాంగుడని చూడకుండానే పోలీసులు భూపాల్‌రెడ్డిని తోసుకుంటూ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ‘మా కార్యకర్తను విడిచిపెట్టండి. కేసీఆర్ గారి మీద అభిమానంతో ఫ్లకార్డులు పట్టుకున్నా కూడా అరెస్టు చేస్తారా? ఎలాంటి అలజడులు చేయకుండా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ప్రశాంతంగా మద్దతు కేసీఆర్‌కు తెలుపుతుంటే.. పోలీసులు అలజడి సృష్టించి, లాఠీచార్జీ చేయాలనుకోవడం దారు ణం. ప్రజలకు ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకునేందుకు, మోసపూరితంగా ఇలా విచారణలకు పిలుస్తున్నారు. బంగారం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టిన పాపం ఊరికినే పోదు.. రైతుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుంది’ అంటూ భూపాల్‌రెడ్డి మండిపడ్డారు.