హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిన కంచ గచ్చిబౌలి భూముల్లో అడవిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కంచ గచ్చిబౌలి పరిధిలోని 400 ఎకరాల భూముల్లోని చెట్లను బుల్డోజర్లతో చదును చేసిన కేసును సుప్రీం కోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. ధ్వంసం చేసిన ప్రాంతంలో అడవిని పునరుద్ధరించాలని ప్రధాన న్యామూర్తి బీఆర్ గవాయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. సుస్థిర అభివృద్ధిని తాము ఎప్పుడూ వ్యతిరేకించబోమని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు.
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ మనుసింఘ్వి కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతను నిలిపేశామని న్యాయమూర్తికి తెలిపారు. ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలిస్తున్నామని, పర్యావరణం, వన్యప్రాణులకు హాని కలిగించనీయబోమని, అడవిని పునరుద్ధరించడానికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని వివరించారు. అందుకు మరో ఆరు నుంచి ఎనిమిది వారాల గడువు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. ప్రభుత్వ అభ్యర్థనకు జస్టిస్ గవాయ్ సానుకూలంగా స్పందించారు. చదును చేసిన ప్రాంతంలో చెట్లను నాటి, పర్యావరణాన్ని రక్షిస్తే ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని అన్నారు. సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు మరో ఆరు వారాలు గడువు ఇస్తున్నట్టు తెలిపారు. కేసును ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీచేశారు.
కూకటివేళ్లతో పెకిలించి.. మీనమేషాలు!
కంచ గచ్చిబౌలి భూముల్లోని చదును చేసిన ప్రాంతాన్ని పునరుద్ధరించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. వంద ఎకరాల్లో పునరుద్ధరణ పనులు ఎలా చేపట్టాలో అర్థంకాక రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆరు నెలలుగా తల పట్టుకుంది. కంచ గచ్చిబౌలి భూములపై బుధవారం మరోసారి జరిగిన విచారణలో చదును చేసిన ప్రాంతంలో పునరుద్ధరణ చేపట్టాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ మనుసింఘ్వి సమగ్ర ప్రణాళిక రూపొందించి సమర్పించడానికి మరో ఆరు వారాల సమయం కావాలని కోరారు.
సుప్రీం విచారణపై హెచ్సీయూ విద్యార్థుల ఆసక్తి
కంచ గచ్చిబౌలి భూముల్లో జరిగిన విధ్వంసంపై సుప్రీంకోర్టు విచారణ, ప్రభుత్వ వాదనలను హెచ్సీయూ విద్యార్థులు ఆసక్తిగా చూస్తున్నారు. సుప్రీంకోర్టు పంపిన కేంద్ర సాధికారిత కమిటీ వచ్చిన సమయంలో కమిటీ సభ్యులతో సమావేశమై అక్కడున్న వృక్ష, జంతుజాలంపై పూర్తి సమాచారాన్ని అందజేశారు. 400 ఎకరాల్లో వందకు పైగా జంతు జాతులు, 700పైగా వృక్ష జాతులున్నట్టు ఆధారాలతో సహా సీఈసీ కమిటీకి నివేదించారు. పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించడంతో సర్కారు ఏవిధమైన చర్యలు తీసుకుంటుందోనని ఎదురు చూస్తున్నారు.