వర్ని, అక్టోబర్ 28: కమ్మ సామాజిక వర్గంతో తనకు విడదీయలేని అనుబంధం ఉన్నదని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కమ్మ కులస్థులు 30 ఏండ్లుగా తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని తెలిపారు. బాన్సువాడలో ప్రతిపక్షాలకు అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. స్పీకర్‌కు మద్దతుగా శనివారం బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కమ్మ కులస్థుల ఆధ్వర్యంలో 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో నిర్వహించిన కమ్మవారి ఆత్మీయ సమ్మేళనంలో స్పీకర్ మాట్లాడారు. కమ్మ సామాజికవర్గం వారిని కుటుంబ సభ్యులుగా భావిస్తానని, వ్యవసాయం చేసుకుంటున్న తనను శ్రీనివాసరావు ప్రోత్సహించి రాజకీయాల వైపు తీసుకొచ్చారని, ఆ తర్వాత రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని సర్వేలు చెబుతున్నాయని పోచారం స్పష్టం చేశారు.
చంద్రబాబు అరెస్టు దుర్మార్గం
దక్షిణ భారతదేశంలో అత్యంత సీనియర్ నాయకుడైన చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నట్టు స్పీకర్ పోచారం ప్రకటించారు. 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని రాజకీయ కక్షలతో అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని కోరారు. అంతకుముందు వర్ని మండలం నెహ్రూనగర్‌కు చెందిన అప్పసాని శ్రీనివాసరావు నామినేషన్ ఫీజు కోసం రూ.25 వేలను పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, స్పీకర్ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కమ్మ కులస్థులు పాల్గొన్నారు.