కామారెడ్డి, ఫిబ్రవరి 13 : కామారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను ఎస్పీ రాజేశ్చంద్ర వెల్లడించారు. 2023 డిసెంబర్ 13న అర్ధరాత్రి సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో 20 ఏండ్ల గుర్తుతెలియని మహిళ శవం దహనం చేసిన స్థితిలో కనిపించింది. పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. మెడిద ప్రశాంత్ ఆస్తి కోసం తన స్నేహితుడు పూణ ప్రసాద్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులను వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లినట్టు పోలీసు విచారణలో తేలింది. కేసు రుజువు కావడంతో ప్రశాంత్కు ఉరిశిక్ష, రూ.8 వేల జరిమానా, మరో ఇద్దరు నిందితులు విష్ణు, ఒడ్డెమ్మకు జీవిత ఖైదు, రూ.8 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.