హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): కల్యాణీ చాళుక్యుల శాసనాల ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కంకల్ గ్రామంలో గుర్తించినట్టు పురావస్తు పరిశోధకులు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వీరభద్రాలయ ప్రాంగణంలో రెండు శిలాఫలకాలపై మూడు లభించగా, అవి కల్యాణీ చాళుక్యుల కాలానివిగా పరిశోధనలో తేలినట్టు పేర్కొన్నారు.
కల్యాణీ చాళు క్య చక్రవర్తి భూలోకమల్లదేవ, 3వ సోమేశ్వరుడు తమ పాలనలో క్రీ.శ.1129 డిసెంబర్ 25, 1130 అక్టోబర్ 5, 1132 జనవరి 8న శాసనాలను లిఖించినట్టు చెప్పారు. భూములతోపాటు వివిధ దానధర్మాల వివరాలు సైతం ఈ శాసనాలపై ఉన్నట్టు తెలిపారు. ఉపాధ్యాయుడు సంపత్‌కుమార్ సమాచారం మేరకు తనతోపాటు శ్రీరామో జు హరగోపాల్ ఈ 3 శాసనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టు వివరించారు.