హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : వంద రోజుల్లోనే హామీలు అమలుచేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. వన్ ఇయర్ తర్వాత వన్ విలేజ్ అనడం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు రాని గ్రామాలు రణరంగంగా మారుతాయని హెచ్చరించారు. ‘మండలానికి ఒక్క గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ఆ గ్రామంలో 4 పథకాలను అమలు చేస్తాం’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్నీ ఇస్తామని మభ్యపెట్టి ఏడాది తర్వాత ఒక్క గ్రామమే అని పేర్కొనటం సర్కార్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటా అబద్ధపు హామీలు ఊదరగొట్టి.. గద్దెనెక్కి నాన్చి నాన్చి ఇప్పుడు మండలానికి ఒక గ్రామంలోనే పథకాలను ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకో గ్రామంలో మాత్రమే పథకాలు ప్రారంభించి చేతులు దులుపుకొన్నది. ఇది ముమ్మాటికీ యావత్ తెలంగాణ ప్రజలను మోసం చెయ్యడమే. ఈ స్పీడుతో పథకాలను ప్రభుత్వం అమలు చేసుకుంటూపోతే 60 ఏండ్లయినా తెలంగాణలోని అన్ని గ్రామాలకు పథకాలు అందవు.
‘మండలానికి ఒక గ్రామంలోనే కాంగ్రెస్ మ్యానిఫెస్టో, గ్యారెంటీ కార్డులను పంచిండ్రా?, ఒక్క ఊరిలోనే ప్రచారం చేసి, ఆ మేరకే హామీలిచ్చి, కేవలం ఆయా గ్రామాల ప్రజలనే ఓట్లు అడిగిండ్రా?’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నలు సందించారు. కాంగ్రెస్ పార్టీ అనేక గడువులు పెట్టి వాయిదాల మీద వాయిదాలు పెట్టి చివరికి రాష్ట్ర ప్రజలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా మోసం చేసిన తీరు దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు ప్రచారంలో గాని, శనివారం సాయంత్రం వరకు గాని ఏ రోజు కూడా మండలానికి ఒక్క గ్రామంలోనే పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదని విమర్శించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సోమవారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్వీ క్యాలెండర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమంలో బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొననున్నారు.
మండలానికి ఒక్క గ్రామంలోనే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలను పంచిండ్రా? మండలానికి ఒక్క గ్రామంలోనే గ్యారెంటీ కార్డులు ఇచ్చిండ్రా? ఎన్నికల ప్రచారాన్ని ఒక్క గ్రామంలోనే చేసిండ్రా? మండలంలో ఒక్క గ్రామంలోనే ఓట్లు అడిగిండ్రా? నాడు అందరికీ అన్నీ అని మభ్యపెట్టి ఇవ్వాళ కొందరికే కొన్ని అన్నట్టు చేస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను వంచించిన కాంగ్రెస్‌ను రాష్ట్ర ప్రజలు క్షమించరు.
మోసగిస్తే తగిన బుద్ధి చెప్తరు
ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో కాంగ్రెస్ చేసిన నయవంచనను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు క్షమించబోరని కేటీఆర్ స్పష్టంచేశారు. అన్ని గ్రామాల ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను గుర్తుపెట్టుకున్నారని తెలిపారు. ప్రతి ఇంటికీ అబద్ధపు హామీలను ఊదరగొట్టి వన్ ఇయర్ తర్వాత వన్ విలేజ్ అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమే అని మండిపడ్డారు. ‘ప్రతిపక్షంగా ఇంకో నాలుగేండ్లు ఓపిక పట్టడానికి మేము సిద్ధం కాని, ఏరుదాటాక తెప్ప తగలేసే మీ ఏడాది దగా పాలనను చూసిన తర్వాత ఆగడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా లేరు.
పథకాలు రాని గ్రామాల్లో రేపటి నుంచి ప్రజా రణరంగమే జరుగుతుంది. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి గ్రామానికి, ప్రజలకు అండగా ఉంటాం. కాంగ్రెస్ చేసిన ఈ దుర్మార్గానికి, మోసానికి అనేక రకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మండలానికి ఒక ఊరు అనే మోసపూరిత విధానాన్ని పకనపెట్టి అన్ని గ్రామాల్లో స్యాచురేషన్ పద్ధతిలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను ప్రజలు బహిషరిస్తారని హెచ్చరించారు.