హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): 2022 కాళోజీ నారాయణరావు పురస్కారానికి ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈనెల 9న ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేస్తారు. అవార్డు కింద రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందజేస్తారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
కాళోజీ పురస్కారానికి ఎంపికైన హరగోపాల్‌కు భాషా, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు. తాను ఎంతగానో అభిమానించే కాళోజీ పేరిట ఇచ్చే పురస్కారానికి ఎంపిక కావడం అదృష్టమని హరగోపాల్ అన్నారు. సంతోషంగానే కాదు, గర్వంగా కూడా ఉన్నదని పేర్కొన్నారు. కాళోజీతో తనకున్న అనుబంధాన్ని ఈసందర్భంగా గుర్తుచేసుకున్నారు. తనను అవార్డుకు ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఇతర పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.
‘మట్టిపొత్తిళ్ల’లోంచి ఎదిగిన కవి శ్రీరామోజు
యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన శ్రీరామోజు హరగోపాల్ తన తండ్రి విశ్వనాథం నుంచి స్ఫూర్తి పొందారు. దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు విద్యాబోధన నిర్వహించి 2013లో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే తిరునగరిగా ప్రసిద్ధులైన రామానుజయ్య దగ్గర వచనకవిత్వంలో ఓనమాలు దిద్దారు. ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొంటూనే తెలంగాణ సాహితీ ఉద్యమాలతోనూ మమేకం అయ్యారు.
ఇప్పటివరకు ‘మట్టిపొత్తిళ్లు’, ‘మూలకం’, ‘రెండు దోసిళ్లకాలం, ‘కొండపొదుగుపూలు’, ‘చెలిమెలు’ ఇలా ఐదు కవిత్వ సంపుటాలు వెలువరించారు. వచన కవిత్వంలో తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్నారు. పదవీ విరమణ చేశాక తెలంగాణ జాగృతి చరిత్ర విభాగంలో పనిచేశారు. తెలంగాణ చరిత్రను నిరంతరంగా అధ్యయనం చేస్తున్నారు. సొంత ఊరు ఆలేరు చరిత్రను అధ్యయనం చేసి ‘ఆలేటి కంపణం’ పుస్తకాన్ని వెలువరించారు. విరువంటి గోపాలకృష్ణ మార్గదర్శనంలో చరిత్ర పరిశోధనవైపు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించి కొనసాగిస్తున్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యునిగా అనేక పురావస్తు ప్రదేశాల్లో పరిశోధనలు చేస్తున్నారు. హిందూ ఆలయాలతో పాటుగా ప్రాచీన బౌద్ధ, జైన క్షేత్రాల చరిత్రను తవ్వితీస్తున్నారు. శాసన పరిశోధకుడిగానూ పేరుపొందారు.