హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ నివేదికలన్నీ వచ్చాక వాటన్నింటినీ అధ్యయనం చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సచివాలయంలో శుక్రవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ నివేదిక, ఎన్డీఎస్ఏ రిపోర్టులు వచ్చాయని తెలిపారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో భాగమైన మూడు బరాజ్‌లపై జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ కొనసాగిస్తున్నదని వెల్లడించారు. ఆ కమిషన్ నివేదిక కూడా వచ్చిన తరువాత అన్ని నివేదికలను అధ్యయనం చేసి, ఆపై బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కమిషన్ స్వతంత్రంగా విచారణ జరుపుతున్నదని పేర్కొన్నారు. కొందరు నాయకులు కమిషన్‌ను తప్పుబట్టడం, రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు కమిషన్ ఎదుట హాజరుకావాలని కోరారు.