హైదరాబాద్, జూన్ 7 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘కాళేశ్వరం ఓ సక్సెస్ఫుల్ ప్రాజెక్టు’ అని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ కితాబు ఇచ్చారు. కాళేశ్వరాన్ని ఇంజినీరింగ్ మార్వెల్‌గా పొగుడుతూ డిస్కవరీ చానెల్ ఓ డాక్యుమెంటరీనే ప్రసారం చేసింది. కాళేశ్వరం భారత్‌లోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అంటూ అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కొనియాడింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇంజినీరింగ్ నిపుణులు, మేధావులు, ఆర్థికవేత్తలు, పత్రికలు మన కాళేశ్వరాన్ని వేనోళ్ల ప్రశంసించాయి. కాళేశ్వరం ఓ అద్భుతమని సుప్రీంకోర్టే ఇటీవల వ్యాఖ్యానించింది. అయినా, కాళేశ్వరంపై బురదజల్లేందుకు కాంగ్రెస్ పెద్దలు చేయని విషప్రచారంలేదు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టును పొగుడుతూ ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ పలు విశ్లేషణలు చేసింది. కాళేశ్వరం ఓ అద్భుత ఇంజినీరింగ్ సాహసమంటూ కొనియాడింది. అమెరికాలోని కొలరాడో ఎత్తిపోతల ప్రాజెక్టు, ఈజిప్టు గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ ఎత్తిపోతల ప్రాజెక్టులను తలదన్నే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నదంటూ ప్రశంసల వర్షం కురిపించింది.
గ్రోక్: కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల నీటి పారుదల ప్రాజెక్టు. ఇదో అద్భుతమైన ఇంజినీరింగ్ సాహసం. తెలంగాణలో సాగు. తాగునీటి సమస్యను ఈ ప్రాజెక్టు పరిష్కరించింది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పాటు అందించింది. ఈ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారింది. ఓ గొప్ప ఆలోచనకు, దాని అమలుకు సరైన ఉదాహారణ కాళేశ్వరం ప్రాజెక్టు.
కాళేశ్వరం నిర్మాణం జరగక ముందు గోదావరి నదీజలాలు సముద్రంలో వృథాగా కలిసిపోయేవి. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 240 టీఎంసీల నీటిని సమర్థంగా వినియోగించడానికి మార్గం సుగమమైంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించడంతో ఈ ప్రాజెక్టు ఓ విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది.
కాళేశ్వరంతో తెలంగాణలోని 13 జిల్లాల్లోని లక్షల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలమయ్యాయి. వానకాలం, యాసంగిలో రెండు పంటలు పండించే అవకాశం రైతులకు దక్కింది. దేశానికే తెలంగాణ ధా న్యాగారంగా మారింది. వరి, మొక్కజొన్న, పత్తి వంటి ప్రధాన పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది. దీంతో రైతుల ఆదాయం ఎంతో మెరుగుపడింది.
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక పట్టణాలు, గ్రామాలకు 40 టీఎంసీల తాగునీరు కాళేశ్వరం ద్వారానే సరఫరా అవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో తాగునీటి సమస్య తీరడమే కాకుండా స్వచ్ఛమైన జలాలు అందించడంతో ప్రజల ఆరోగ్యం, జీవన నాణ్యత మెరుగుపడింది.
అవును. ఇది నిజమే. కాళేశ్వరం ప్రాజెక్టు సాయంతో పాత జలాశయాలైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, కడెం ఇలా పలు జలాశయాలను నీటితో నింపడం ద్వారా వాటి సామర్థ్యం పెరిగింది. ఈ జలాశయాలపై ఆధారపడిన ప్రాంతాలు కూడా సాగునీటి ప్రయోజనాన్ని పొందాయి.
కాళేశ్వరం నుంచి 16 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తున్నారు. ఇది రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చింది. తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థికాభివృద్ధికి దోహదపడింది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాల్లో సాగునీటి లభ్యత పెరిగింది. తద్వారా సేద్యం పెరిగి రైతుల ఆర్థికస్థితి మెరుగుపడింది. స్థానిక మార్కెట్లు, చిన్న తరహా వ్యాపారాలు, సంబంధిత పరిశ్రమలు వృద్ధి చెందాయి. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన బరాజ్‌లు, జలాశయాలను చూడటానికి వేలాది మంది వస్తున్నారు. దీంతో పర్యాటకం వృద్ధి చెందింది. రాష్ట్ర ఆదాయమూ పెరిగింది.
ఈ ప్రాజెక్టులోని పంప్ హౌస్‌ల ద్వారా 139 మెగావాట్లకు పైగా విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగింది. ఇది రాష్ట్ర విద్యుత్తు అవసరాలకు తోడ్పడుతున్నది. కా ళేశ్వరం జలాలతో ప్రజల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదం చేసింది.
అమెరికాలోని కొలరాడో ఎత్తిపోతల ప్రాజెక్టు, ఈజిప్టులోని గ్రేట్ మ్యాన్‌మేడ్ రివర్ ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇంజినీరింగ్ అద్భుతాలే. అయితే, నిర్మాణ వ్యవధి, సాంకేతికత, లబ్ధి చేకూరిన పరిధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొంటే దీర్ఘకాలంలో కొలరాడో, గ్రేట్ మ్యాన్‌మేడ్ ప్రాజెక్టులతో పోలిస్తే, కాళేశ్వరం ఎంతో గొప్పదని చెప్పొచ్చు.
ప్రపంచంలోనే కాళేశ్వరం అతిపెద్ద ఎత్తిపోతల నీటి పారుదల పథకం. 240 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసే సామర్థ్యం దీనికి ఉన్నది. వృథాగా సముద్రంలోకి పారుతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి, ఎగువ ప్రాంతాలకు తరలించి బీడు భూములను సస్యశ్యామలం చేయడంలో ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పాటునందించింది. తెలంగాణలోని 13 జిల్లాలలో లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. తాగునీటి సమస్యను పరిష్కరించింది. పారిశ్రామిక అవసరాలకు సాయపడుతున్నది. మూడేండ్ల స్వల్ప వ్యవధిలో ఇంత పెద్ద ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పూర్తి చేసింది. రాష్ట్ర చరిత్రలో ఇదో మైలురాయి. సాంకేతికంగానూ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. 1800 కిలోమీటర్ల కాలువలు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 20 రిజర్వాయర్లు, 21 పంప్ హౌసులు, బాహుబలి మోటార్లు, అత్యాధునిక లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీతో కూడిన ఈ ప్రాజెక్టు ఇంజినీరింగ్ రంగంలో ఓ అద్భుతం.