హైదరాబాద్, ఆగస్టు31 (నమస్తే తెలంగాణ ) : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక మొత్తం చట్టానికే విరుద్ధంగా ఉన్నదని నీటిరంగ నిపుణులు, న్యాయకోవిదులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి అసంబద్ధమైన రిపోర్టును చూడలేదని అంటున్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం-1952 ప్రకారం కమిషన్ ఇచ్చే రిపోర్టు నిజనిర్ధారణ రిపోర్టు మాత్రమేనని, దానికి న్యాయపరమైన విలువేలేదని, న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాబోదని వివరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మొదటినుంచీ చెప్తున్న కట్టుకథలకు అనుగుణంగానే ఈ రిపోర్టు ఉన్నదని పేర్కొంటున్నారు. 665 పేజీల్లో కాంగ్రెస్ మార్క్ ఆరోపణలే తప్ప మరేమీ లేదని కొట్టిపడేశారు. షా కమిషన్, లిబర్హాన్ కమిషన్ల తరహాలో పీసీ ఘోష్ తాను విచారణకు అనుసరించిన ప్రొసీజర్‌ను రిపోర్టులో ప్రస్తావించలేదని న్యాయకోవిదులు చెప్తున్నారు.
సెక్షన్- 5ఏ కింద, సెక్షన్-8బీ కింద ఎవరికి నోటీసులు ఇచ్చారో చెప్పలేదని అంటున్నారు. సెక్షన్-8బీ కింద ఎవరికీ నోటీసులివ్వలేదని కమిషన్ రిపోర్టే స్పష్టం చేస్తున్నదని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిపోర్టుకు ఎలాంటి సాధికారత లేదని, న్యాయ పరీక్షకు నిలవబోదని స్పష్టంచేస్తున్నారు. అందుకే ఆదివారం ఆదరాబాదరగా అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టినట్టు అర్థమవుతున్నదని న్యాయకోవిదులు, ఇరిగేషన్ నిపుణులు చర్చించుకుంటున్నారు. రిపోర్టులో సరుకు, కొత్త సంగతేమీలేదని అంటున్నారు. విజిలెన్స్ కమిషన్ తన ఫైనల్ రిపోర్టును తప్ప మిగతా రికార్డులు ఏమీఇవ్వలేదని పేజీ నంబర్ 657లో పీసీ ఘోష్ వెల్లడించారని, విజిలెన్స్ రిపోర్టునే ఇవ్వని ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను ఇచ్చిందంటే ఎట్లా నమ్మాలని? ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తనకు అనుకూలమైన విషయాలు మాత్రమే కమిషన్‌కు ఇచ్చి మిగతావి దాచిందనడానికి ఇంతకంటే నిదర్శ నం ఏముంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.
విజిలెన్స్ నివేదికలను కమిషన్‌కు ప్రభుత్వం ఇవ్వకపోవడానికి కారణమున్నది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ బరాజ్‌ల వద్ద సాయిల్ టెస్ట్, మెటీరియల్ టెస్ట్, క్వాలిటీ టెస్ట్ చేస్తే ఉండాల్సిన క్వాలిటీ కంటే ఎకువ ఉన్నట్టు తేలింది. ఆ విషయం కమిషన్‌కు తెలియదు. బయటకు రావొద్దనే విజిలెన్స్ పూర్తి రిపోర్టును కమిషన్‌కు ప్రభుత్వం ఇవ్వలేదని ఇరిగేషన్ నిపుణులు, న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎన్డీఏఎస్ఏ రిపోర్టుపై చివరి పేజీ నంబర్ 665లో పేరొన్నది. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పిన సూచనను పాటించాలా? వద్దా?
అనేది ప్రభుత్వానికే వదిలేస్తున్నట్టు కమిషన్ వెల్లడించింది. ఆ విధంగా కమిషన్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఎన్డీఎస్ఏ చెప్పినా ప్రభుత్వం ఇప్పటివరకు బరాజ్‌కు ఎలాంటి మరమ్మతులూ చేయడం లేదు. కమిషన్ పూర్తిగా ప్రభుత్వానికి అనుగుణంగా రిపోర్టు ఇచ్చి, ఏకపక్షంగా నిందారోపణలు చేసింది తప్ప మరేమీలేదని నీటిరంగ నిపుణులు వివరిస్తున్నారు. కమిషన్ అనేక విషయాలను విస్మరించిందని చెప్తున్నారు. రిటైర్డ్ ఇంజినీర్లతో వేసిన నిపుణుల కమిటీ రిపోర్టును తాను కోరుకున్న రీతిలో అన్వయించుకున్నదే తప్ప వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని భావిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల విషయంలోనూ కమిషనే ఒకచోట లేవని, మరోచోట అనుమతులున్నాయని ఇలా అసంబద్ధంగా పేర్కొన్నదని వివరిస్తున్నారు.