Suryapeta | సూర్యాపేట, మార్చి 22 (నమస్తే తెలంగాణ): సాగు నీళ్లు లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. కాళేశ్వరం కాల్వల్లో నీళ్లు పారక.. పంటలు పండక రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడమేగాక బతుకు దెరువు కోసం రైతులు మళ్లీ వలసబాట పట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు మళ్లీ దాపురించాయని గుర్తుచేసుకుంటున్నారు సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని రత్యా తండా రైతులు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వద్దన్నదాకా నీళ్లను పారించిన కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి సర్కారు పండ బెట్టడంతో సూర్యాపేట జిల్లా రైతాంగం అల్లాడిపోతున్నది. గోదావరి జలాలు నిలిచిపోవడంతో ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.35 వేలు నష్టపోయారు. కొద్దోగొప్పో నీళ్లు పడితే పంటలను కాపాడుకోవచ్చన్న ఆశతో వేస్తున్న బోర్లు ఫెయిల్ అవుతుండటంతో మరింత అప్పుల్లోకి కూరుకుపోతున్నారు. వెరసి ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి బతుకుదెరువు కోసం వలసలు పునరావృతం అవుతున్నాయి. జిల్లాలో కాళేశ్వరం పరిధిలోగల ఎస్సారెస్పీ ఆయకట్టులో ఇప్పటికే దాదాపు లక్షకుపైనే ఎకరాలు ఎండిపోయింది.
అప్పుల భారానికి తోడు ఊళ్లో పని లేకపోవడంతో రైతన్న కుటుంబ పోషణ కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. ఒక్క పెన్‌పహాడ్ మండలంలోనే 85 శాతం వరి ఎండిపోయింది. ఈ క్రమంలో 67 కుటుంబాలు ఉన్న రత్యా తండాలో 40కిపైనే కుటుంబాలు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లాయి. కేసీఆర్ సర్కారు ఉన్నన్నినాళ్లు పొలాల్లో నీళ్లు జాలు వారాయని, ఇప్పుడు చూద్దామన్నా చుక్క నీరు కనిపించడం లేదని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ హయాంలో రైతు కుటుంబాలు కొద్దికొద్దిగా చేయి తిప్పుకోగా, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు బంద్ చేసింది. కాల్వలు ఎండిపోయాయి. చెరువులు చుక్కనీళ్లు లేవు. మళ్లీ నీటి కరువు.. విద్యుత్తు కోతలు.. ఎరువుల కొరత వంటి సమస్యలు పునరావృతమయ్యాయి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేండ్లపాటు కేసీఆర్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ వృత్తులు జీవం పునరుజ్జీవం పోసుకోవడంతో అందరికీ చేతినిండా పని దొరికింది. ఆ రోజుల్లో గత ఉమ్మడి రాష్ట్ర దుస్థితి గుర్తుకు వస్తేనే అదో పీడకలలా భావించేవారు. ఆ చీకటి రోజులు నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం పరిధిలోని ఎస్సారెస్పీ ఆయకట్టు గ్రామాల్లో ఏ రైతును కదిలించినా గోడు వెల్లబోసుకుంటున్నాడు.
ఎవరిని పలుకరించిన వలస మాటే..
ఈ యాసంగిలో నీళ్లు రాకపోవడంతో 1,350 ఎకరాలు ఎండిపోగా 150 ఎకరాల వరకు బోర్లతో పంటను కాపాడుకుంటున్నట్టు పెన్‌పహాడ్ మండల పరిధిలోని రత్యాతండా రైతులు తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’ ఆ తండాలో పర్యటించిన సమయంలో ఏ రైతును కదిలించినా.. ‘నా కొడుకు పని కోసం పట్నం పోయిండు.. నా మనుమడు వలస పోయిండు.. మా ఆయన పని కోసం దూరం పోయిండు’ అనే సమాధానమే వచ్చింది. సాగునీరు లేక పదెకరాల్లో ఎనిమిది, ఐదెకరాల్లో నాలుగు ఎకరాలు ఎండిపోయిందని రైతు కుటుంబాలు వాపోయాయి.సొంత ఊళ్లోనే కాదు మండలంలో కూడా చేసేందుకు పనిలేక చాలా మంది చిట్యాల, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. 40 రైతు కుటుంబాల్లో ఇంటికి ఒక్కరు, ఇద్దరు చొప్పున వలస పోగా మరో 15 నుంచి 20 కుటుంబాలు సూర్యాపేట, కోదాడ పట్టణాలకు వెళ్లి రోజువారీ కూలీ పని చేసి తిరిగి తండాకు వస్తున్నాయి.
నాలుగెకరాలు ఎండింది
నాలుగెకరాలు సాగు చేస్తే మొత్తం ఎండిపోయింది. మా ఇంట్లో ముగ్గురు కొడుకులు కుటుంబాలను పోషించుకునేందుకు వరంగల్‌కు వలస పొయిండ్రు. నాకు 70 ఏండ్లు దాటినయి. గతంతో ఎప్పుడూ నా భూమికి నీళ్లు రాలేదు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు కాల్వల్లో నీళ్లు వచ్చినయ్. ఆరేండ్లు మస్తు నీళ్లు చూసినం. నా జీవితంలో అట్ల చూస్త అనుకోలేదు. ఇయ్యాల ఏమైందో గానీ నీళ్లు రాక మళ్లీ కన్న బాధలు పడుతున్నం. ఊరికి కరువొచ్చింది.. పంటలన్నీ ఎండుతున్నయ్, పోరలు పనికి పట్నం పోతున్నరు.
– భూక్యా భగవాన్, రత్యాతండా, పెన్‌పహాడ్ మండలం