జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గులాబీ జెండా రెపరెపలాడింది. మూడో విడత ఎన్నికల్లో 1,010 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందాడు. కేసీఆర్ కాళేశ్వరం కేంద్రంగా ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. అలాగే కన్నెపల్లి ప్రాజెక్టు వద్ద కన్నెపల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నీర్ల ప్రభాకర్ గెలుపొంది కాంగ్రెస్‌కు దీటుగా బదులిచ్చాడు.
కాళేశ్వరం, కన్నెపల్లి ప్రాజెక్టులున్న గ్రామాల్లో ప్రజలు ఓటుతో కాంగ్రెస్‌కు సమాధానం ఇచ్చారు. మేడిగడ్డ కుంగినా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ చేసుకొని రైతులకు నీళ్లిచ్చే అవకాశమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలను ప్రజలు పటాపంచలు చేశారు. అటు మేడిగడ్డ(అంబట్పల్లి)లో సైతం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు. మంత్రి ఇలాకాలో కాళేశ్వరం ప్రాజెక్టుల వద్ద సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ చేజార్చుకున్నది.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లో కాంగ్రెస్ ఓడింది. చివరి విడత ఎన్నికల్లో 10కి పది వార్డులను బీఆర్ఎస్ గెలుచుకున్నది. సర్పంచ్‌గా ఆల శ్రీకాంత్‌రెడ్డి 761 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉప సర్పంచ్ పదవి కూడా బీఆర్ఎస్కే దక్కింది. రెండో విడతలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి సొంతూళ్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి వెళ్లిన భూత్పూర్ మాజీ ఎంపీపీ శేఖర్‌రెడ్డి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి నరేశ్ విజయం సాధించారు.