నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ ఐదురోజుల ఏసీబీ కస్టడీ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వ దవాఖానలో నిందితుడికి ఆరోగ్య చికిత్సలు చేసిన అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపర్చారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం నిందితుడిని అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితుడి నుంచి కస్టడీ సమయంలో సేకరించిన కీలక సాక్షాధారాలను ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. నిందితుడి బ్యాంక్ లాకర్లను పరిశీలించి కీలక స్థిరాస్తి పత్రాలను, బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా ఆర్జించిన ఆస్తులతోపాటు ఇతర ప్రాంతానికి బదిలీపై వెళ్లినప్పటికీ ఎస్సారెస్పీ ప్రాజెక్టు కార్యాలయంలోనే ఎందుకు? పనిచేశారన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగించారు. తెలంగాణ ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్టుమెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నూనె శ్రీధర్‌ను 5 రోజులకోసం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ఎస్సారెస్పీ క్యాంప్, డివిజన్ నం.8, చొప్పదండి, కరీంనగర్లో ఉద్యోగం చేస్తూ ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించాడనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.