అర్ధరాత్రి తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రతిపత్తిని కాంగ్రెస్ ప్రభుత్వం చెరపట్టింది. తెలంగాణోళ్లకు దూపతీర్చి.. బీళ్లకు నీళ్లు తాపిన మహా కాళేశ్వరంపై సీబీఐ విచారణకు నిర్ణయించింది. ఇది నిండు కుండపై రాయి విసిరే చర్య. మహాసంకల్పానికి మరక అంటించే దుశ్చర్య. కాంగ్రెస్-బీజేపీ కలిసి నడుపుతున్న ఈ కుతంత్రాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నరు. కేసీఆర్ వైపే ఉన్నామని, ఆయననే నమ్ముతున్నామని జనం ఎలుగెత్తి చాటుతున్నరు.
‘నమస్తే తెలంగాణ’ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిర్వహించిన సర్వేలో జన మనోగతం వెల్లడైంది. 7 ప్రశ్నల ఆధారంగా నిర్వహించిన ఈ సర్వేలో అన్ని జిల్లాల్లో కలిపి 26,102 మందిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. గోదావరి, కాళేశ్వరం, బనకచర్ల తదితర నీటిపారుదల అంశాలపై ప్రజాభిప్రాయాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం చేసింది. దాదాపు అందరిదీ ఒకే మాట. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు రాజకీయ కుట్రపూరితమని 76.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో 11.8శాతం ఏటూ తేల్చుకోలేని సందిగ్ధతలో ఉన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ జలధార కాళేశ్వరాన్ని నిరర్థక ప్రాజెక్టు అంటూ రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదనే ప్రచారం పచ్చి అబద్ధమని మరోసారి రూఢీ అయ్యింది. అందు కే మేడిగడ్డపై కాంగ్రెస్ సర్కారు అనవసర రాజకీయం చేస్తున్నదని తెలంగాణ బిడ్డలు ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. కాళేశ్వరంపై చెప్పిన కట్టుకథలను ఇప్పటికైనా పక్కనబెట్టి వెంటనే మేడిగడ్డ బరాజ్‌కు రిపేరు చేసి వినియోగంలోకి తేవాలని రేవంత్ సర్కారును తెలంగాణ రైతన్నలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’ నిర్వహించిన సర్వేలో మెజార్టీ తెలంగాణ ప్రజలు కాళేశ్వరానికి జేజేలు పలికారు. సర్వేలో పాల్గొన్న ప్రతీ వందమందిలో సగటున 86 మంది కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థించడం విశేషం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం పెరిగిందని ఏకంగా 86.68 శాతం మంది నిక్కచ్చిగా తేల్చిచెప్పారు. అంతేకాదు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించినందుకు కేసీఆర్‌పై సీబీఐ కేసు పెట్టడం కరెక్టేనా? అని ప్రశ్నిస్తే.. కాదంటూ 76.40 శాతం మంది తెగేసి చెప్పడం గమనార్హం.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో 7వ బ్లాక్‌లోని 2 పిల్లర్లు కుంగిన విషయం విదితమే. దురదృష్టవశాత్తూ జరిగిన ఈ ఘటనను సాకుగా చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాదని కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారానికి తెరతీసింది. మేడిగడ్డను చూయిస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిత్యం బద్నాం చేస్తున్నది. బరాజ్‌ను పునరుద్ధరించకుండా కమిటీలు, కమిషన్ల ముసుగులో విచారణల పేరిట కాలయాపన చేస్తున్నది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రజలు, రాష్ట్ర రైతాంగం ఏం ఆలోచిస్తున్నది? కాళేశ్వరం ద్వారా అన్నదాతలు ఏమైనా ప్రయోజనాలు పొందారా? లేక, కాంగ్రెస్ కుటిల రాజకీయాన్ని, అసత్య ప్రచారాలను విశ్వసిస్తున్నారా? తదితర విషయాలను తెలుసుకొని.. రాష్ట్ర ప్రజల అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు ‘నమస్తే తెలంగాణ’ నడుం కట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా సర్వేను నిర్వహించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం, మేజర్ డిస్ట్రిబ్యూటరీ కాలువలను చెరువులతో అనుసంధానించడం ఫలితంగా తెలంగాణలో సాగువిస్తీర్ణం గణనీయం పెరిగింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఆయకట్టు అందుకు సజీవ సాక్ష్యం.
రాష్ట్రవ్యాప్తంగా ఆయా చోట్ల రైతులు, సామాన్య ప్రజలను నమస్తే తెలంగాణ ప్రతినిధులు పలకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అభిప్రాయాలను తెలుసుకొనేందుకు మొత్తం గా 26,102 మంది అభిప్రాయాలను తెలుసుకున్నది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు 86.28 శాతం మంది ప్రజలు, అన్నదాతలు జై కొట్టారు. ప్రాజెక్టు నిరర్థకమంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు చెంపచెల్లుమనిపించేలా సూటిగా సమాధానమిచ్చారు.
రైతాంగానికి నీళ్లివ్వకుండా.. కేసీఆర్‌ను బద్నాం చేయడమే లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అనవసరపు రాజకీయం చేస్తున్నదని ఇప్పటికే పలువురు నిపుణులు రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పుడు సర్వేలో పాల్గొన్న అన్నదాతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వం అనవసరంగా రాజకీయ రాద్ధాంతం చేస్తున్నదని ప్రతీ పది మందిలో ఏడుగురు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఇకనైనా తన కుటిల రాజకీయాలను పక్కనబెట్టి మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేసి తిరిగి వాడకంలోకి తీసుకురావాలని 83.3 శాతం మంది డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సరైందేనని 86.28 శాతం మంది అభిప్రాయపడగా.. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు పెద్దయెత్తున ప్రయోజనాలు అందాయని 85.31 శాతం మంది తేల్చి చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం, మేజర్ డిస్ట్రిబ్యూటరీ కాలువలను చెరువులతో అనుసంధానించడం ఫలితంగా తెలంగాణలో సాగువిస్తీర్ణం గణనీయం పెరిగింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఆయకట్టు అందుకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నది. ఒకనాడు స్టేజీ1కి కూడా సాగునీరు దిక్కులేని దుస్థితి నుంచి స్టేజీ2లోని సూర్యాపేట, తుంగతుర్తిలో చిట్టచివరి ఆయకట్టుకు నీరందించే వరకూ కాళేశ్వరం ఫలాలు యావత్తూ తెలంగాణకు అందాయి. ఆర్బీఐ, వ్యవసాయశాఖ తదితర సంస్థల గణాంకాలన్నీ రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణాన్ని రూడీ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం ద్వారా ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదంటూ పదేపదే అబద్దపు ప్రచారం చేస్తున్నది. ఆయకట్టు ఎట్లా పెరిగిందంటే ఎస్సారెస్పీ నీళ్లేనంటూ బుకాయిస్తది. మరి గతంలో ఎందుకివ్వలేదని అడిగితే మాత్రం సమాధానం ఇవ్వడంలేదు. దీంతో కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని అర్థమవుతున్నది.
ఈ క్రమంలో కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ద్వారా రాష్ట్రంలో నిజంగానే సాగునీటి సౌకర్యం పెరిగిందా? అని సర్వేలో పాల్గొన్న వారిని ‘నమస్తే’ బృందం ప్రశ్నించింది. దీనికి 86.68 శాతం మంది అవునంటూ ఢంకాబజాయించి చెప్పారు. రాష్ట్రంలో కాళేశ్వరం రాడార్‌లోని యావత్తు రైతాంగం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత, కేసీఆర్ పాలనలోనే సాగునీటి వ్యవస్థ మెరుగుపడిందని కితాబిచ్చింది. అది కాళేశ్వరంతోనే సాకారమైనట్టు పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సరైనదేనని, ఈ ప్రాజెక్టు ద్వారా తమకు ఎంతో లబ్ధి చేకూరిందని రైతన్నలు అనందం వ్యక్తం చేశారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పక్కనపెట్టిన తరువాత నిరుడు యాసంగిలో స్టేజీ2లో లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. ప్రస్తుతం ఈ వానకాలం సీజన్లో కూడా ఎస్సారెస్పీకి సంబంధించి మొత్తం 13.65లక్షల ఎకరాల్లో కేవలం 2.34లక్షల ఎకరాలకే నీరిస్తామని రేవంత్ సర్కారు ప్రకటించింది. 11.31లక్షల ఎకరాలకు నీరివ్వలేమని చేతులేత్తేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనబెట్టడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని నిపుణులు మండిపడుతున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బరాజ్‌ను మరమ్మతు చేయడం మాని కేవలం రాజకీయ ప్రయోజనాలకే రేవంత్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాజెక్టు పేరిట కేసీఆర్‌ను బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌లో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాన్ని సాకుగా చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే నిష్ప్రయోజనమనే అసత్య ప్రచారానికి కాంగ్రెస్, బీజేపీ నేతలు పూనుకున్నారు. అంతేకాదు అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కూడా కూలిపోతాయంటూ విషం చిమ్మారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బరాజ్‌ను మరమ్మతు చేయడం మాని కేవలం రాజకీయ ప్రయోజనాలకే రేవంత్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాజెక్టు పేరిట కేసీఆర్‌ను బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి, మంత్రులు స్వయంగా బరాజ్‌ను సందర్శించి మరీ అది నిష్ప్రయోజనం, నిరర్ధకం, లక్ష కోట్లు వృథా ఉంటూ అబద్ధాలు వల్లెవేశారు. అసెంబ్లీ వేదికగా అబద్దపు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతూ నీటిని ఎత్తిపోయడం నిలుపుదల చేశారు. ఆపై విజిలెన్స్ విచారణ, అదేసమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌తో ఎంక్వయిరీ పేరిటా హడావుడి చేశారు. నివేదిక పేరిట ఇప్పటికీ అదే రాజకీయం చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర రైతాంగం ముక్తకంఠంతో ఖండించింది. బరాజ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కావాలనే రాద్దాంతం చేస్తున్నదని తేల్చి చెప్పింది. అంతేకాదు సత్వరం మేడిగడ్డ బరాజ్‌ను పునరుద్ధరించి, వాడకంలోకి తీసుకురావాలంటూ 83.33% మంది ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఇకనైనా తన కుటిల రాజకీయాలను పక్కనబెట్టి మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేసి తిరిగి వాడకంలోకి తీసుకురావాలని 83.3 శాతం మంది డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సరైందేనని 86.28 శాతం మంది అభిప్రాయపడ్డారు. బనకచర్లపైనా కాంగ్రెస్ తీరుపై రైతుల గుర్రు..
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంతోపాటు ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపైనా రైతులు గుర్రుమంటున్నారు. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి, అనుమతులు లేకుండానే పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. గోదావరి నుంచి 200 టీఎంసీలను కృష్ణా మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ సర్కారు ప్రణాళికను సిద్ధం చేసుకున్నది. ఈ క్రమంలో అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నది. ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా ఏపీతో చర్చిస్తామంటూ ఒకసారి, అడ్డుకుంటామని మరోసారి.. ఇలా రోజుకో తీరుగా వ్యవహరిస్తున్నది. చర్చల కమిటీకి అంగీకరించింది. తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం వాటిల్లనున్న సందర్భంలోనూ బేషరతుగా వ్యతిరేకించకుండా, ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంతో రేవంత్‌రెడ్డి సర్కార్ సాగిలబడుతున్నట్టు వ్యవహరిస్తున్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఏపీని నిలువరించడం కాంగ్రెస్, బీజేపీలకు సాధ్యం కాదని తేల్చి చెబుతున్నది. అంతేకాదు బనకచర్ల ప్రాజెక్టును ఆపగలిగే సత్తా బీఆర్ఎస్కే ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నది. దీన్ని ధ్రువపరుస్తూ.. ఏపీ బనకచర్లను ఆపగలిగే సామర్థ్యం బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదంటూ సర్వేలో పాల్గొన్న 71.75 శాతం మంది తేల్చి చెప్పారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కామధేనువు వంటిదని, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే మేడిగడ్డ బరాజ్‌కు రిపేర్లు చేయకుండా తెలంగాణను రేవంత్ ప్రభుత్వం ఎండబెడుతున్నదని మెజారిటీ తెలంగాణ వాదులు అభిప్రాయపడుతున్నారు.
సమైక్య పాలనలో ఆత్మహత్యలకు నిలయంగా మారిన తెలంగాణను.. ప్రత్యేక రాష్ట్రంలో అన్నపూర్ణగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేసిన నాయకుడు కేసీఆర్. అలాంటి నాయకుడిపై కమిషన్ వేసి, సహజ న్యాయ సూత్రాలు పాటించుకండా ఏకపక్షంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం అప్రజాస్వామికం. ఇది రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. ఎన్ని కుట్రలు పన్నినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారు.
బీజేపీతో సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోరాడు. ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. పారదర్శకత లేని నివేదికను హైకోర్టు కొట్టి వేస్తుందనే ఉద్దేశంతోనే రేవంత్‌రెడ్డి హడావుడిగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి, సీబీఐ దర్యాప్తుపై ప్రకటన చేశారు. బీఆర్ఎస్పై కుట్రతోనే ఈ ప్రకటన అని స్పష్టమవుతున్నది.
కాళేశ్వరం రైతులకు మేలు చేసే గొప్ప ప్రాజెక్టు. ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కారు రాజకీయం చేస్తున్నది. కేసీఆర్‌పై కుట్రలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన. కేసీఆర్‌ను బద్నాం చేయడం మంచిది కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలనే కుట్రతోనే కాంగ్రెస్ సీబీఐ డ్రామాను తెరపైకి తీసుకొచ్చింది. కాళేశ్వరంపై రాజకీయం చేస్తే.. ఆరు గ్యారెంటీలను ప్రజలు మర్చిపోతారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ స్వరూపాన్నే మార్చివేసింది. రాష్ర్టాన్ని సాధించి, పదేండ్లు అద్భుతంగా పనిచేసిన కేసీఆర్ విజనరీని మార్చేస్తామని, అసలా పేరునే తిరగరాస్తామని అనుకోవడం సరికాదు. ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పును పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగత, రాజకీయ కక్షసాధింపు చర్యల వల్ల తాత్కాలిక ప్రయోజనం పొందొచ్చుకానీ, దీర్ఘకాలికంగా నష్టపోయేది తెలంగాణే.