మల్లన్నసాగర్ సాకారంపై మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : తెలంగాణపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేయించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆ ప్రేమే మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మించడంలో ఎదురైన సమస్యలు, సవాళ్లను అధిగమిస్తూ, తక్కువ సమయంలో పూర్తిచేయించగలిగిందని ట్విట్టర్లో కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వకపోయినా, ఆర్థిక సహాయం చేయకపోయినా దేశంలోనే అతితక్కువ వయసున్న రాష్ట్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ నాయకత్వంలో పూర్తి చేసిందని పేర్కొన్నారు. తెలంగాణపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ ఎనలేనిదన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ను జాతికి అంకితం చేయడంతో ఒక ప్రధానమైన మైలురాయిని చేరుకుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఎంత సాయం చేసిందని మీరు అనుకుంటున్నారంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గుండుసున్నా అంటూ ట్విట్టర్లో అనేక మంది సమాధానం ఇచ్చారు.