హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై సీడబ్ల్యూపీఆర్ఎస్ ఇచ్చిన నివేదికతో రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ కలిసి గత మూడేళ్లుగా సాగిస్తున్న కుట్ర తేటతెల్లమైందని, ఎన్డీఎస్ఏను బూచిగా చూపుతూ ఆడిన నాటకం బూటకమనే విషయం బట్టబయలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆ రెండు బరాజ్‌లు సురక్షితమని చెప్పడంతో కాంగ్రెస్, బీజేపీకి ముఖం చెల్లకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఇంతకాలం బీఆర్ఎస్ను బదనాం చేసిన ఆ రెండు పార్టీల నేతలు ఇప్పటికైనా తమ తప్పు ఒప్పుకోవాలని, మాజీ సీఎం కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కన్నెపల్లి ద్వారా నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నిసార్లు మొత్తుకున్నప్పటికీ ఎన్టీఎస్ఏను సాకుగా చూపి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ రైతులకు 60 టీఎంసీల నీళ్లు అందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్లకు అలవాటు పడ్డ ప్రభుత్వం లక్షల ఎకరాలకు నీళ్లివ్వడంలేదని నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్ భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిశోర్, పీ శేఖర్‌రెడ్డి, నోముల భగత్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు నుంచి వరదజలాలను మాత్రమే తరలించాలనే నిబంధనలను ఏపీ ప్రభుత్వం కాలరాస్తున్నదని, దుర్మార్గంగా ఇప్పటికే 140 టీఎంసీల నీళ్లను అక్రమంగా తీసుకెళ్లిందని దుయ్యబట్టారు.
ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 175 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, 110 టీఎంసీల నీళ్లు వస్తే ఆ ప్రాజెక్టు నిండేదని, ఎడమ కాలువ కింద పంటలకు నీళ్లు సరిపోయేవని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ పాలనలో 510 అడుగుల నీళ్లున్నప్పుడు సైతం ఎడమ కాలువ కింద పంటలకు నీరందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం 532 అడుగుల మేర నిల్వలు ఉన్నప్పటికీ రేవంత్ ప్రభుత్వం నీరివ్వకుండా పంటలను ఎండబెడుతున్నదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీళ్లు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ యాగం పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారిద్దరూ కలిసి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా రైతుల నీటి హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు నీళ్లిస్తే కరెంట్, విత్తనాలు, ఎరువులు ఇవ్వాల్సి ఉంటుందని, పంటలను కొనాల్సివస్తుందని, కొంటే బోనస్ అందించాల్సి ఉంటుందనే నీరివ్వకుండా అన్యాయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎల్ నినో పేరిట నీళ్లు విడుదల చేయవద్దని దుర్మార్గంగా అధికారులను ఆదేశించడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి రైతులకు ఎల్ నినో శాపం లేదని, కాంగ్రెస్ సర్కార్ శాపం తగిలిందని విరుచుకుపడ్డారు. పోలవరం, పట్టిసీమ నుంచి యథేచ్ఛగా నీళ్లు పోతున్నాయని గుర్తుచేస్తూ.. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతుల పరిస్థితి ఉమ్మడి పాలనలో కంటే దారుణంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరికి వరద వచ్చినప్పటి నుంచి కన్నెపల్లి పంపులు ఆన్‌చేస్తే మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, రంగనాయకసాగర్ నిండేవని, తద్వారా భువనగిరి, సూర్యాపేట ప్రాంతాల రైతులకు నీరు అందేదని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ మూర్తీభవించిన అజ్ఞానంతో ఎల్ నినోను సాకుగా చూపుతూ నీరందించడంలేదని తూర్పారబట్టారు. రైతులకు నీళ్లిస్తే పండిన పంటను చేతగాని కాంగ్రెస్ సర్కార్ కొనకున్నా బయట మార్కెట్లో అమ్ముకొనేవారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ దురుద్దేశాన్ని మంత్రి కోమటిరెడ్డే స్వయంగా బయటపెట్టాడని, సాగర్ నిండినా నీరివ్వబోమంటూ ఆరుతడి పంటలు వేసుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చాడని గుర్తుచేశారు. అయినప్పటికీ ఏ జిల్లాలో ఎలాంటి ఆరుతడి పంటలు వేసుకోవాలో, ఎప్పుడెప్పుడు నీరిస్తారో చెప్పలేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి పంటల సాగుపై సోయి, కనీస ప్రణాళిక లేదని ధ్వజమెత్తారు. సాగర్ ఎడమ కాలువకు నీరివ్వాలని నల్లగొండ రైతులు, ఎస్ఎల్బీసీ కింద నీళ్లు ఇవ్వాలని దేవరకొండ ప్రాంత రైతులు ధర్నా చేయాల్సి వచ్చిందని, అయినప్పటికీ సాగర్‌లో నీళ్లు లేవంటూ మంత్రి ఉత్తమ్ బుకాయించడం సిగ్గుచేటని పేర్కొంటూ.. సాగర్‌లో దూకితే నీళ్లు ఉన్నాయో లేదో తెలుస్తుందని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా సోయిలేని మాటలు కట్టిపెట్టాలని, లేకుంటే రైతులు ఉరికించి కొడుతారని హెచ్చరించారు.
సీఎం, మంత్రి మధ్య పంచాయితీకి ‘భూ భారతి’లో నెలకొన్న సంక్షోభమే కారణమని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పైసలు దండుకోవడం..భూములు పంచుకోవడం కాంగ్రెస్ నేతలకు వెన్నతోపెట్టిన విద్య అంటూ దెప్పిపొడిచారు. సీఎం, మంత్రుల పంచాయితీపై మీడియాలో చర్చ జరుగుతున్నట్టే కాంగ్రెస్ నేతలు సైతం చర్చించుకుంటున్నారని తెలిపారు. ‘మేఘారెడ్డి కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడని చిన్నారి.. ఊర్లకు పోతే అభివృద్ధికి పైసలేవని ప్రజలు అడుగుతున్నారని యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అంటున్నారు. ప్రభుత్వం వరద సహాయం ఇవ్వడంలేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రపంచ బ్యాంక్‌కు లేఖ రాశారు. కమీషన్లు ఇవ్వనిదే పని జరుగడంలేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చెప్పిండు. మొత్తంగా కాంగ్రెస్ నేతల పంచాయితీ చూస్తుంటే విస్తరాకుల దగ్గర కుక్కలు కొట్లాడుకున్నట్టుగా ఉన్నది’ అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సొంత పార్టీ వాళ్ల ఆరోపణలకు సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడని ఎద్దేవా చేశారు.
22ఏ జాబితాలో మీ భూములు ఉన్నాయంటూ సీఎం రేవంత్, మరో ఇద్దరు మంత్రులు సొంత పార్టీ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. లండన్‌లో హరీశ్‌రావు, కేటీఆర్, రేవంత్‌రెడ్డి కలిశారని బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్‌రెడ్డి చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. ‘సీబీఐ, రా కేంద్రం చేతిలోనే ఉన్నాయి కదా.. దమ్ముంటే వారు రేవంత్‌ను కలిసిన ఫొటోలను బయటపెట్టు’ అని సవాల్ విసిరారు. చిల్లరగా మాట్లాడి ప్రజల్లో పలుచన కావద్దని చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిసే బీజేపీ నేతలు రోజుకో కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని ఆరోపించారు.